Ind Vs SA 3rd Test: కోహ్లి వచ్చేశాడు.. భారత్‌ చరిత్ర సృష్టించేనా?

11 Jan, 2022 07:38 IST|Sakshi

కేప్‌టౌన్‌: ‘ఫ్రీడం ట్రోఫీ’లో విజేతను తేల్చే సమరానికి సమయమైంది. ఒక్కో టెస్టు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్న స్థితిలో నేటినుంచి జరిగే మూడో టెస్టులో గెలిచే జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోనుంది. 2018లో ఇక్కడే జరిగిన సిరీస్‌లో భారత్‌ తొలి రెండు టెస్టులు ఓడి సిరీస్‌ కోల్పోయిన అనంతరం మూడో టెస్టును నెగ్గి ఆధిక్యాన్ని 1–2కు తగ్గించింది. ఇప్పుడు దానికంటే భిన్నమైన పరిస్థితుల్లో చివరి టెస్టు నిర్ణాయకంగా మారడం విశేషం.  ఈ టెస్టు గెలిస్తేనే సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గాలన్న భారత జట్టు కల నెరవేరుతుంది. మరి కోహ్లి ఈ ఫీట్‌ను సాధించి తన ఖాతాలో చారిత్రాత్మక రికార్డును జమ చేసుకుంటాడో చూడాలి!

సిరాజ్‌ అవుట్‌... 
భారత తుది జట్టులో రెండు మార్పులు జరగడం ఖాయమైంది. వెన్ను నొప్పితో రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పూర్తి ఫిట్‌గా మారి ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. దాంతో హైదరాబాద్‌ బ్యాటర్‌ హనుమ విహారిపై వేటు పడటం దాదాపు ఖాయమైంది. వాండరర్స్‌లో విహారి మంచి ప్రదర్శనే కనబర్చినా...అనుభవం, పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు పుజారా, రహానేలలో ఒకరిపై వేటు వేసి విహారిని ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు. పైగా గత టెస్టు రెండు  ఇన్నింగ్స్‌లో వీరిద్దరు కీలక అర్ధ సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చారు. మరో వైపు తొడ కండరాల గాయంతో రెండో టెస్టులో తీవ్రంగా ఇబ్బంది పడిన హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఈ మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు.

అతని స్థానంలో ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది.  రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. నిజాయితీగా చెప్పాలంటే భారత జట్టు బ్యాటింగ్‌ వైఫల్యమే ఓటమికి కారణమైంది. కాబట్టి ఈ టెస్టులో భారత్‌ భారీ స్కోరు సాధించగలిగితేనే బౌలర్లపై నమ్మకం ఉంచవచ్చు. ఓపెనర్లు రాహుల్, మయాంక్‌ మరోసారి శుభారంభం అందించాల్సి ఉండగా...పుజారా, రహానే తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కోహ్లినుంచి కూడా జట్టు ఒక భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.  

మార్పుల్లేకుండానే... 
కెప్టెన్‌ ఎల్గర్‌ దుర్బేధ్యమైన ఆటతో జట్టు భారం మోస్తుండగా, మరో ఓపెనర్‌ మార్క్‌రమ్‌ రాణించాల్సి ఉంది. కీగన్‌ పీటర్సన్‌ కూడా బాగానే ఆడుతున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. మిడిలార్డర్‌లో వాన్‌ డర్‌ డసెన్‌ ఇంకా తడబడుతూనే ఉండటం దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెడుతోంది. తెంబా బవుమా మాత్రం చక్కటి ప్రదర్శన కనబరిస్తూ సిరీస్‌లో కీలక ఆటగాడిగా మారాడు. ఒక్కసారిగా జట్టు పేస్‌ బలంగా మారిపోయింది. రబడ ఫామ్‌లోకి రావడంతో పాటు జాన్సెన్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తుండటం భారత్‌ను ఇబ్బంది పెట్టవచ్చు.

చదవండి: Ind Vs Sa 3rd Test: మాకు అశ్విన్‌ ఉన్నాడు.. అద్భుతాలు చేస్తాడు.. జడేజాను మిస్సవడం లేదు: కోహ్లి

మరిన్ని వార్తలు