Ind Vs SL: నేడు రెండో వన్డే.. సిరీస్‌పై భారత్‌ గురి

20 Jul, 2021 04:23 IST|Sakshi

నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే

మధ్యాహ్నం 3 గంటల నుంచి సోని సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

కొలంబో: పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. రోజు విరామం తర్వాత శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలోని భారత్‌ మరో పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది. మరోవైపు శ్రీలంక పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. గెలవడం మాట అటుంచి కనీసం ప్రత్యర్థికి గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జట్టు ఉంది.  

ఇదే మంచి అవకాశం
రెగ్యులర్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉండటంతో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లలో యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు భారత్‌కు చక్కటి అవకాశం దక్కింది. జట్టుతో ఉన్నా ఎక్కువగా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యే మనీశ్‌ పాండేతో పాటు గత మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌లకు ఈ పర్యటనతో తమను తాము నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం లభించింది. అందుకు తగ్గట్లే ఇషాన్‌ కిషన్‌ తొలి వన్డేలో చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్‌లో అతని బ్యాటింగ్‌ను చూస్తే మొదటి వన్డే ఆడుతున్నట్లే అనిపించలేదు. ఇక చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా దూకుడైన ఇన్నింగ్స్‌తో అలరించాడు.

ఓపెనర్లుగా పృథ్వీ షా, ధావన్‌ తొలి వన్డేలో అదరగొట్టారు. ముఖ్యంగా పృథ్వీ షా స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝుళిపిస్తూ అన్ని వైపులా షాట్లు ఆడాడు. అయితే మనీశ్‌ పాండే మాత్రం క్రీజులో కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడు కూడా రాణిస్తే భారత్‌కు ఇక తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో కూడా భారత్‌ పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో కృనాల్‌ పాండ్యా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతనికి కేవలం ఒక్క వికెటే దక్కినా... ప్రత్యర్థి ఆటగాళ్లు అతని బౌలింగ్‌లో పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్, దీపక్‌ చహర్‌ తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అనుభవజ్ఞుడు భువనేశ్వర్‌ మాత్రం తన స్థాయికి తగ్గట్లు బౌలింగ్‌ చేయలేకపోయాడు. అయితే రెండో వన్డేలో అతను బౌలింగ్‌ లయను అందుకుంటాడనే విశ్వాసంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది. దాంతో ఈ మ్యాచ్‌లో ఎటువంటి మార్పులు లేకుండానే భారత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది.

భయం వీడితేనే...
టాప్‌ టీమ్‌తో ఆడుతున్నామనే భయాన్ని వీడితేనే శ్రీలంక జట్టు మెరుగైన ప్రదర్శనను కనబర్చగలదు. ఎందుకంటే సీనియర్ల గైర్హాజరీలో ఆ టీమ్‌ అంతా కొత్త ముఖాలతోనే ఆడుతోంది. తొలి వన్డేలో శ్రీలంక బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించింది. చివర్లో వచ్చిన చమిక కరుణరత్నే పోరాటంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. అంతేకాకుండా ఓపెనర్లుగా వచ్చి అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక చక్కగా బ్యాటింగ్‌ చేశారు. వీరితో పాటు కెప్టెన్‌ దసున్‌ షనక, చరిత్‌ అసలంక కూడా ఆడినంత సేపు ఆత్మవిశ్వాసంతో కనిపించారు. వీరందరికీ మంచి ఆరంభం లభించినా వాటిని భారీ స్కోర్లుగా మార్చలేకపోయారు. వీరు ఆ సమస్యను అధిగమిస్తే భారత్‌కు శ్రీలంక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. బౌలింగ్‌లో మాత్రం ఆ జట్టు తేలిపోయింది. ధనంజయ డిసిల్వా రెండు వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. దుష్మంత చమీర మాత్రమే బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇసురు ఉదాన స్థానంలో లహిరు కుమార తుది జట్టులోకి వచ్చే చాన్స్‌ ఉంది.

పిచ్, వాతావరణం
తొలి వన్డే జరిగిన ప్రేమదాస స్టేడియంలోనే రెండో వన్డే కూడా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌ కోసం వేరే పిచ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. పిచ్‌పై టర్న్‌ ఉన్నా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.

జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: ధావన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్, మనీశ్‌ పాండే, సూర్యకుమార్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్, దీపక్‌ చహర్, కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌.
శ్రీలంక: దసున్‌ షనక (కెప్టెన్‌), అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, భానుక రాజపక్స, ధనంజయ, చరిత్‌ అసలంక, హసరంగ, కరుణరత్నే, చమీర, సందకన్, లహిరు కుమార.

మరిన్ని వార్తలు