India Vs SL 2nd T20: నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు

28 Jul, 2021 23:54 IST|Sakshi

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20లో ఆతిధ్య జట్టు బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 132 పరుగులు సాధించింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శ్రీలంక జట్టులో  ధనుంజయ డిసిల్వా 34 బంతుల్లో 40 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించారు. మూడు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమానంగా నిలిచాయి.

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. షనక(3) ఔట్‌
కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో లంక కెప్టెన్‌ షనక స్టంప్‌ అవుట్‌ అయ్యాడు. కుల్దీప్‌ సంధించిన వైడ్‌ బాల్‌ను తప్పుగా అంచనా వేసిన షన​క.. క్రీజ్‌ వదిలి ముందుకు రావడంతో కీపర్‌ సామ్సన్‌ స్టంప్‌ అవుట్‌ చేశాడు. 9.1 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 55/3. క్రీజ్‌లోకి డిసిల్వా వచ్చాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. సమరవిక్రమ(8) క్లీన్‌బౌల్డ్‌
మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో సమరవిక్రమ(8) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 39/2. క్రీజ్లో భానుక(19), షనక ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. ఫెర్నాండో(11) ఔట్‌
133 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోర్‌ 12 పరుగుల వద్ద భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో అవిష్క ఫెర్నాండో(11) రాహుల్‌ చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రస్తుతం క్రీజ్‌లో భానుక(1), సమరవిక్రమ ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 13/1. 

నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైన టీమిండియా..లంక టార్గెట్‌133
శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌల్‌ చేయడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ ధవన్‌(40) మినహా మిగతా బ్యాట్స్‌మెన్లంతా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. లంక బౌలరల్లో ధనంజయ 2.. చమీర, హసరంగ, షనక తలో వికెట్‌ పడగొట్టారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. నితీశ్‌ రాణా(9) ఔట్‌
చమీర వేసిన ఆఖరి ఓవర్లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో నితీశ్‌ రాణా ఔటయ్యాడు. స్లో బాల్‌ను అంచనా వేయడంతో పొరబడ్డ రాణా.. డిసిల్వాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజ్‌లోకి నవ్‌దీప్‌ సైనీ వచ్చాడు. 

ధనంజయ మాయాజాలం.. సామ్సన్‌(7) క్లీన్‌ బౌల్డ్‌
లంక స్పిన్నర్లు ధనంజయ, హసరంగ టీమిండియా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపిస్తున్నారు. వరుస ఓవర్లలో వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేస్తున్నారు. ధనంజయ వేసిన 17వ ఓవర్‌లో సామ్సన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అంతకుముందు ధవన్‌, పడిక్కల్‌ కూడా వీరి బౌలింగ్‌లోనే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 107/4. క్రీజ్లో నితీశ్‌ రాణా(2), భువనేశ్వర్‌ కుమార్‌(3) ఉన్నారు.  

టీమిండియా మూడో వికెట్‌ డౌన్‌.. పడిక్కల్‌(29) క్లీన్‌ బౌల్డ్‌
లంక రిస్ట్‌ స్పిన్నర్‌ హసరంగ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. నిలకడగా ఆడుతున్న పడిక్కల్‌ను(23 బంతుల్లో 29; ఫోర్‌, సిక్స్‌) హసరంగ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 100/3. క్రీజ్లో సామ్సన్‌(6), నితీశ్‌ రాణా ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. ధవన్‌(40) క్లీన్‌ బౌల్డ్‌
టీమిండియా కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ 40 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. శ్రీలంక స్పిన్నర్‌ అఖిల ధనంజయ బౌలింగ్‌లో గబ్బర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 85/2. సంజూ సామ్సన్‌ బరిలోకి దిగాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రుతురాజ్‌(21) ఔట్‌
అరంగేట్రం కుర్రాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. లంక కెప్టెన్‌ శనక బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ భానుకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజ్‌లోకి మరో అరంగేట్రం ఆటగాడు పడిక్కల్‌ వచ్చాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 49/1. ధవన్‌(24 బంతుల్లో 26; 3 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నాడు.

టీమిండియాకు శుభారంభం.. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు ధవన్‌(22 బంతుల్లో 23; 3 ఫోర్లు), రుతురాజ్‌(13 బంతుల్లో 19; ఫోర్‌) నిలకడగా ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మ్యాచ్‌ ద్వారా టీ20ల్లో అరంగేట్రం చేస్తున్న రుతురాజ్‌.. స్వేచ్ఛగా షాట్లు ఆడుతున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్‌ 45/0గా ఉంది. 

కొలొంబో: భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20లో ఆతిధ్య జట్టు టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా కరోనా బారిన పడటంతో మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఏడుగురు(పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్, మనీష్ పాండే) టీమిండియా ఆటగాళ్లను ఐసోలేషన్‌కు తరలించిన నేపథ్యంలో నేటి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొన్నాయి.

ఈ విషయమై బీసీసీఐ.. లంక బోర్డుతో సంప్రదింపులు జరిపి సిరీస్‌ యధావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. అయితే ఏడుగురు ప్రధాన ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉండటంతో టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు జరిగాయి. రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, నితీశ్‌ రాణా, కుల్దీప్‌ యాదవ్‌, రాహుల్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియాలు జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌ ద్వారా పడిక్కల్‌, రుతురాజ్‌, నితీశ్‌ రాణా, చేతన్‌ సకారియాలు టీ20ల్లో అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు లంక జట్టు సైతం రెండు మార్పులతో బరిలోకి దిగింది. అశేన్‌ బండార, చరిత్‌ అసలంక స్థానాల్లో సదీర సమరవిక్రమ, రమేశ్‌ మెండిస్‌లు జట్టులోకి వచ్చారు. 

తుది జట్లు: 
భారత్: శిఖర్ ధవన్(కెప్టెన్), రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, నితీశ్‌ రాణా, కుల్దీప్‌ యాదవ్‌, రాహుల్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా, సంజూ సామ్సన్‌(కీపర్), భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), ధనుంజయ డిసిల్వా, సదీర సమరవిక్రమ, రమేశ్‌ మెండిస్‌, డసన్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనంజయ

మరిన్ని వార్తలు