శ్రీలంకలో భారత బి జట్టు పర్యటనపై ఆ దేశ మాజీ కెప్టెన్‌ అసహనం

2 Jul, 2021 16:18 IST|Sakshi

కొలంబో: శ్రీలంక పర్యటనకు భారత్‌.. బి జట్టును పంపిచడం తమ దేశ క్రికెట్‌కు ఘోర అవమానమని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రతిపాదనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు అస్సలు బుద్ది లేదని ఆయన మండిపడ్డాడు. టెలివిజన్ మార్కెటింగ్‌లో భాగంగానే ఈ సిరీస్‌కు లంక క్రికెట్ బోర్డు ఒప్పుకుందని ఆరోపించాడు. తాజాగా పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లంక బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్.. తమ బలమైన జట్టును ఇంగ్లండ్‌కు పంపించి బలహీనమైన రెండో జట్టును శ్రీలంకకు పంపించిందని విమర్శించాడు.

బీసీసీఐ ఇలా వ్యవహరించడానకి తమ దేశ క్రికెట్ బోర్డు అసమర్థతతనే కారణమని ధ్వజమెత్తాడు. లంక క్రికెట్ బోర్డు అడ్మినిస్ట్రేషన్‌లో లోపాల కారణంగా తమ దేశ ఆటగాళ్లకు క్రమశిక్షణ లేకుండా పోయిందని, ఆటతీరు కూడా దారుణంగా ఉందని ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న లంక జట్టును ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, అర్జున రణతుంగ సారథ్యంలో శ్రీలంక జట్టు 1996 వన్డే ప్రపంచ కప్ సాధించింది. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధవన్ సారథ్యంలో యువ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం లంక పర్యటనకు వెళ్లింది. జూలై 13 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు జరగనున్నాయి.

భారత జట్టు: శిఖర్‌ ధవన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చహర్‌, కృష్ణప్ప గౌతం, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), దీపక్‌ చహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా

మరిన్ని వార్తలు