లంక ఉత్కంఠ విజయం

29 Jul, 2021 06:23 IST|Sakshi

రెండో టి20లో భారత్‌ ఓటమి

రాణించిన ధనంజయ, కరుణరత్నే

భారత బ్యాట్స్‌మెన్‌ విఫలం

నేడు చివరి టి20  

కొలంబో: చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన రెండో టి20 మ్యాచ్‌లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1–1తో సమమైంది. నేడే సిరీస్‌ విజేతను నిర్ణయించే మూడో టి20 జరగనుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 40; 5 ఫోర్లు), తొలి మ్యాచ్‌ ఆడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (18 బంతుల్లో 21; 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెం డు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్‌; 1 సిక్స్‌) కడదాక క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌ ద్వారా భారత్‌ తరఫున దేవ్‌దత్‌ పడిక్కల్, రుతురాజ్‌ గైక్వాడ్, నితీశ్‌ రాణా, చేతన్‌ సకారియా టి20ల్లో అరంగేట్రం చేశారు.  

పోరాడిన భారత్‌...
మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా... జట్టు విజయం కోసం భారత బౌలర్లు చివరి వరకు పోరాడారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి శ్రీలంక కష్టపడింది. 18 ఓవర్లు ముగిశాక శ్రీలంక విజయ సమీకరణం 12 బంతుల్లో 20 పరుగులుగా ఉండగా... 19వ ఓవర్‌ను భువనేశ్వర్‌ వేశాడు. ఆ ఓవర్‌లో కరుణరత్నే సిక్సర్‌ బాదడంతో మొత్తం 12 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా... బౌలింగ్‌కు వచ్చిన సకారియా శ్రీలంకను కట్టడి చేయలేకపోయాడు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) మినోద్‌ (బి) షనక 21; ధావన్‌ (బి) అకిల 40; పడిక్కల్‌ (బి) హసరంగ 29; సామ్సన్‌ (బి) అకిల 7; నితీశ్‌ రాణా (సి) హసరంగ (బి) చమీర 9; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 13; సైనీ (నా
టౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–49, 2–81, 3–99, 4–104, 5–130. బౌలింగ్‌: చమీర 4–0–23–1; కరుణరత్నే 1–0–6–0; అకిల 4–0–29–2; ఉదాన 1–0–7–0; హసరంగ 4–0–30–1; షనక 2–0–14–1; రమేశ్‌ మెండిస్‌ 2–0–9–0; ధనంజయ డిసిల్వా 2–0–13–0.  

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి) చహర్‌ (బి) భువనేశ్వర్‌ 11; మినోద్‌ (సి) చహర్‌ (బి) కుల్దీప్‌ 36; సమరవిక్రమ (బి) వరుణ్‌ 8; షనక (స్టంప్డ్‌) (బి) కుల్దీప్‌ 3; ధనంజయ డిసిల్వా (నాటౌట్‌) 40; హసరంగ (సి) భువనేశ్వర్‌ (బి) చహర్‌ 15; రమేశ్‌ మెండిస్‌ (సి) రుతురాజ్‌ (బి) సకారియా 2; కరుణరత్నే (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–12, 2–39, 3–55, 4–66, 5–94, 6–105. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–21–1; సకారియా 3.4–0–34–1; వరుణ్‌ 4–0–18–1; రాహుల్‌ చహర్‌ 4–0–27–1; కుల్దీప్‌ 4–0–30–2.  

మరిన్ని వార్తలు