IND Vs SL 2nd ODI: చాహర్‌ ఒంటరి పోరాటం.. భారత్‌ ఘన విజయం

20 Jul, 2021 23:28 IST|Sakshi

చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భువనేశ్వర్‌ కుమార్‌ అండతో దీపక్‌ చాహర్‌ ఒంటరి పోరాటం చేసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. భారత్‌ ఇన్నింగ్స్‌లో దీపక్‌ చాహర్‌ 82 బంతుల్లో 69 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలవడంతో పాటు జట్టుకు విజయాన‍్నందించాడు.

45 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ స్కోర్‌ 245/7గా ఉంది. దీపక్‌ చాహర్‌ 51, భువనేశ్వర్‌ కుమార్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దీపక్‌ చాహర్‌ 64 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. భారత్‌ విజయతీరాలకు చేరడానికి 33 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉంది.

ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. కృనాల్‌(35) క్లీన్‌బౌల్డ్‌
టీమిండియా తరఫున అఖరి స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ కృనాల్‌ పాండ్యా(54 బంతుల్లో 35; 3 ఫోర్లు) కూడా ఔటయ్యాడు. వనిందు హసరంగ బౌలింగ్‌లో కృనాల్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 35.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 193/6. భారత్‌ గెలవాలంటే మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్లో చాహర్‌(9), భువనేశ్వర్‌ కుమార్‌(0) ఉన్నారు. 

ఓటమి దిశగా టీమిండియా, సూర్యకుమార్‌ యాదవ్‌(53) ఔట్‌
టీమిండియాకు ఆఖరి ఆశాకిరణంలా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌(44 బంతుల్లో 53; 6 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ చేయగానే పెవిలియన్‌ బాటపట్టాడు. సందకన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ ఆరో వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 160/6. క్రీజ్‌లో కృనాల్‌(19), చాహర్‌(0) ఉన్నారు. భారత్‌ గెలవాలంటే మరో 116 పరుగులు చేయాల్సి ఉంది. 

116 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా
లంక కెప్టెన్‌ శనక వేసిన 18వ ఓవర్‌లో రెండో బంతికి మనీశ్‌ పాండే రనౌట్‌ కాగా, అదే ఓవర్‌లో ఆఖరి బంతికి హార్ధిక్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందే హార్ధిక్‌కు లైఫ్‌ లభించినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మిడ్‌ వికెట్‌లో ఉన్న డిసిల్వాకు సునాయాసమైన క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 18 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 116/5. క్రీజ్‌లో సూర్యకుమార్‌(30), కృనాల్‌ పాండ్యా(0) ఉన్నారు.

మనీశ్‌ పాండే(37) రనౌట్‌.. టీమిండియా నాలుగో వికెట్‌ డౌన్‌
మనీశ్‌ పాండే(31 బంతుల్లో 37; 3 ఫోర్లు)ను దురదృష్టం వెంటాడింది. లంక కెప్టెన్‌ శనక బౌలింగ్‌ చేస్తుండగా నాన్‌ స్ట్రయిక్‌ ఎండ్‌ ఉన్న మనీశ్‌.. క్రీజ్‌ వదిలి ముందుకు రావడం, స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్‌ కొట్టిన స్ట్రయిట్‌ డ్రైవ్‌ శనక చేతులను తాకుతూ వికెట్లకు తగలడంతో మనీశ్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 17.2 ఓవర్ల తర్వాత టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. క్రీజ్‌లో సూర్యకుమార్‌(30), హార్దిక్‌(0) ఉన్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. ధవన్‌(29) ఔట్‌
శ్రీలంక లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ వనిందు హసరంగా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ ఆఖరి బంతికి టీమిండియా కెప్టెన్‌ ధవన్‌(38 బంతుల్లో 29; 6 ఫోర్లు)ను ఎల్బీడబ్యూగా ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు మూడు ఓవర్లు వేసిన హసరంగ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన(షా, ధవన్‌) వికెట్లు పడగొట్టాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 65/3. క్రీజ్‌లో మనీశ్‌ పాండే(17), సూర్యకుమార్‌ యాదవ్‌(0) ఉన్నారు.  

ఇషాన్‌ కిషన్‌(1) క్లీన్‌ బౌల్డ్‌, 5 ఓవర్ల తర్వాత 39/2
11 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. తొలుత 28 పరుగుల వద్ద పృథ్వీ షా పెవిలియన్‌కు చేరగా, 5వ ఓవర్‌ ఆఖరి బంతికి ఇషాన్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రజిత బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్ల తర్వాత టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధవన్‌(22)కు తోడుగా మనీవ్‌ పాండే(0) ఉన్నాడు.

 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. పృథీ​ షా(13) ఔట్‌
హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించి జోరుమీదున్నట్లు కనిపించిన టీమిండియా యువ ఓపెనర్‌ పృథ్వీషా(11 బంతుల్లో 13; 3 ఫోర్లు).. హసరంగా వేసిన మూడో ఓవర్‌ ఆఖరి బంతికి క్లీన్‌ బౌల్డయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్‌ 28/1. క్రీజ్‌లో ధవన్‌(7 బంతుల్లో 13; 3 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌(0) ఉన్నారు. 

తొలి ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదిన షా..
శ్రీలంక బౌలర్‌ కసున్‌ రజిత వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే పృథ్వీషా(6 బంతుల్లో 12; 3 ఫోర్లు) చెలరేగిపోయాడు. ఆఖరి మూడు బంతులను  బౌండరీలకు తరలించాడు. దీంతో తొలి ఓవర్‌ ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. 

టీమిండియా టార్గెట్‌ 276
భువీ వేసిన ఆఖరి ఓవర్‌లో మూడో బంతికి సందకన్‌(0) రనౌట్‌ కాగా, చివరి రెండు బంతులను కరణరత్నే(33 బంతుల్లో 44; 5 ఫోర్లు) బౌండరీలకు తరలించడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. కరుణరత్నే అఖరి వరకు క్రీజ్‌లో ఉండి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. టీమిండియా బౌలర్లలో భువీ, చహల్‌ తలో మూడు వికెట్లు, చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టగా ఒకరు రనౌట్‌గా వెనుదిరిగారు. 

సేమ్‌ సీన్‌ రిపీట్‌.. చమీరా(2) ఔట్‌
అంతకుముందు ఓవర్‌లో అసలంకను ఎలా ఔట్‌ చేశాడో అచ్చం అలానే మరో స్లో లెంగ్త్‌ ఆఫ్‌ కట్టర్‌ బంతిని సంధించి చమీరా(5 బంతుల్లో 2)ను పెవిలియన్‌కు పంపాడు భువీ. పడిక్కల్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌లో క్యాచ్‌ అందుకోవడంతో చమీరా పెవిలియన్‌ బాట పట్టాడు. 49.1 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 264/8. క్రీజ్‌లో కరుణరత్నే(35), సందకన్‌(0) ఉన్నారు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. అసలంక(65) ఔట్‌
భువీ వేసిన స్లో లెంగ్త్‌ ఆఫ్‌ కట్టర్‌ బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో అసలంక(68 బంతుల్లో 65; 6 ఫోర్లు) ఔటయ్యాడు. సబ్‌ ఫీల్డర్‌ పడిక్కల్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌లో అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో అతను పెవిలియన్‌ బాట పట్టాడు. 48 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 252/7. క్రీజ్‌లో కరుణరత్నే(25), చమీరా(1) ఉన్నారు. 

చాహర్‌ యార్కర్‌.. హసరంగ(8) క్లీన్‌ బౌల్డ్‌
మూడో స్పెల్‌ తొలి బంతికే దీపక్‌ చాహర్‌ అదరగొట్టాడు. అద్భుతమైన యార్కర్‌తో హసరంగ(11 బంతుల్లో 8; ఫోర్‌)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో 39.1 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 194/6గా ఉంది. క్రీజ్‌లో అసలంక(43 బంతుల్లో 34), కరుణరత్నే(0) ఉన్నారు. భారత బౌలర్లలో చహల్‌ 3, చాహర్‌ 2, భువీ ఓ వికెట్‌ పడగొట్టారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక..శనక(16) క్లీన్‌ బౌల్డ్‌
తొలి వన్డేలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చహల్‌ రెండో వన్డేలో రెచ్చిపోతున్నాడు. తొలి స్పెల్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టిన అతను.. రెండో స్పెల్‌లోనూ మ్యాజిక్‌ చేశాడు. లంక మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శనక(24 బంతుల్లో 16; ఫోర్‌)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 36 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 178/5. క్రీజ్లో అసలంక(34 బంతుల్లో 29), వహిందు హసరంగ(1) ఉన్నారు.

డిసిల్వా(32) ఔట్‌.. 28 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 137/4
దీపక్‌ చాహర్‌ వేసిన నకుల్‌ బంతికి ధనుంజయ డిసిల్వా(45 బంతుల్లో 32; ఫోర్‌) చిక్కాడు. మిడాఫ్‌ దిశగా ఆడే క్రమంలో ధవన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 28 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 137/4గా ఉంది. క్రీజ్‌లో చరిత్‌ అసలంక(5), దసున్‌ శనక(1) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో చహల్‌ 2, భువీ, దీపక్‌ చాహర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. అవిష్క ఫెర్నాండో(50) ఔట్‌
హాఫ్‌ సెంచరీ సాధించి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన లంక ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో(71 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్‌)ను టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బోల్తా కొట్టించాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో ఫెర్నాండో.. మిడాన్‌లో ఉన్న కృనాల్‌ పాండ్యా చేతికి క్యాచ్‌ అందించి వెనుదిరిగాడు. 25 ఓవర్ల తర్వాత లంక జట్టు 3 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధనుంజయ డిసిల్వా(38 బంతుల్లో 26), అసలంక(0) ఉన్నారు. 

చహల్‌ మాయాజాలం.. వరుస బంతుల్లో రెండు వికెట్లు 
టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ మాయ చేశాడు. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులిచ్చిన చహల్‌.. ఆతరువాత వరుస బంతుల్లో భానుక(42 బంతుల్లో 36; 6  ఫోర్లు), రాజపక్సా(0)లను పెవిలియన్‌కు పంపాడు. భానుక క్యాచ్‌ను షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో మనీశ్‌ పాండే అందుకోగా, రాజపక్సా.. వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 13.3 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 77/2. క్రీజ్‌లో ధనుంజయ డిసిల్వా(0), అవిష్క ఫెర్నాండో(41 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్‌) ఉన్నారు.

ధాటిగా ఆడుతున్న లంక ఓపెనర్లు
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. భానుక(23 బంతుల్లో 26; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో(27 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌) టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరి ధాటికి 7.4 ఓవర్లలోనే లంక స్కోర్‌ 50 పరుగులు దాటింది. 8 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 53/0. 

కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ధవన్‌ సేన ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, లంక జట్టు ఓ మార్పు చేసింది. ఉదాన స్థానంలో కసున్‌ రజిత బరిలోకి దిగనున్నాడు. ఇదిలా ఉంటే ఆతిధ్య లంక జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉండగా, టీమిండియా మరో విజయంపై ధీమాగా ఉంది.

టీమిండియా తుదిజట్టు: శిఖర్‌ ధవన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌, మనీష్‌ పాండే, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌
శ్రీలంక తుదిజట్టు: షనక(కెప్టెన్‌), అవిష్కా ఫెర్నాండో, భానుక రాజపక్సా, మినోద్‌ భానుకా, దనంజయ డిసిల్వా, చరిత్‌ ఆసలంకా, వినిందు హసరంగా, చమికా కరుణరత్నే, కసున్‌ రజిత, దుస్మంతా చమీరా, లక్షణ్‌ షన్‌దాకన్‌

మరిన్ని వార్తలు