Ind Vs WI 3rd ODI: క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా...

27 Jul, 2022 00:41 IST|Sakshi

వెస్టిండీస్‌తో ఆఖరి పోరుకు టీమిండియా రె‘ఢీ’

రాత్రి 7 గంటల నుంచి డీడీ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లలో ప్రత్యక్ష ప్రసారం

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ఓటమి ఖాయమైన మ్యాచ్‌లో అనూహ్య విజయంతో సిరీస్‌నే గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. నేడు జరిగే ఆఖరి వన్డేలోనూ నెగ్గి ఆతిథ్య కరీబియన్‌ను వైట్‌వాష్‌ చేయాలని భారత జట్టు భావిస్తోంది.

మరోవైపు సొంతగడ్డపై సిరీస్‌ కోల్పోయిన వెస్టిండీస్‌ జట్టు ఈ మ్యాచ్‌ గెలిచి కనీసం పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే మూడో వన్డే ఆసక్తికరంగా జరగనుంది. ఈ వేదికపై గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు భారీస్కోర్లు నమోదు చేశాయి. చివరి పోరు కూడా ఇక్కడే జరగనుండటంతో మరోసారి ప్రేక్షకులకు పరుగుల విందు ఖాయంగా కనిపిస్తోంది.  

జోరుమీదున్న భారత్‌
ఇక్కడ వరుస విజయాలతోనే కాదు... ఇటీవల వరుస సిరీస్‌ విజయాలతో భారత్‌ జోరు మీదుంది. ఆటగాళ్లు మారినా... సీనియర్లు లేకపోయినా... ఫలితంలో మాత్రం ఏ తేడా లేదు. అదే ఉత్సాహం. అదే పట్టుదల. నిర్లక్ష్యం దరిచేరనీయకుండా కుర్రాళ్లు రాణిస్తున్నారు. టీమిండియా గత రెండు వన్డేల్లోనూ 300 పైచిలుకు స్కోర్లు చేసింది. కెప్టెన్‌ ధావన్‌ సహా టాపార్డర్‌ బ్యాటర్స్‌ శుబ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ఫామ్‌లో ఉన్నారు. అయ్యర్‌ అర్ధసెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

సంజూ సామ్సన్‌ కూడా గత మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఆరో వరుసలో బ్యాటింగ్‌కు దిగుతున్న దీపక్‌ హుడా సత్తా చాటుతున్నాడు. అక్షర్‌ పటేల్‌ ‘షో’ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఏ రకంగా చూసిన భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. బెంగ ఏమైనా ఉంటే అది సూర్యకుమార్‌పైనే! తను కూడా చివరి పోరులో బ్యాట్‌ ఝుళిపిస్తే మరో భారీస్కోరుకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లోనే కాస్త మెరుగుపడాలి. వెస్టిండీస్‌కు మరో 300 ప్లస్‌ అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయాలి.

ఓదార్పు విజయంపై...
మరోవైపు వెస్టిండీస్‌ పరిస్థితి భారత్‌కు పూర్తి భిన్నంగా ఉంది. ప్రత్యర్థి జట్టుకు దీటుగా 300 పైచిలుకు పరుగులైతే చేస్తోంది. కానీ అంత చేసినా... తొలి వన్డేలో ఛేదనలో ఆఖరుకొచ్చేసరికి వెనుకబడింది. రెండో మ్యాచ్‌లో చేసింది కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు షై హోప్, కైల్‌ మేయర్స్, బ్రూక్స్, కింగ్‌ చెప్పుకోదగ్గ స్కోర్లే చేస్తున్నారు. కానీ బౌలింగ్‌ వైఫల్యాలతో మూల్యం చెల్లించుకుంటున్నారు. ఈసారి బౌలింగ్‌ లోపాలపై దృష్టి పెట్టిన కరీబియన్‌ జట్టు ఆఖరి పోరులో గెలిచి తీరాలనే కసితో ఉంది. సమష్టి విజయంతో భారత్‌ క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

పిచ్, వాతావరణం
రెండు వన్డేల్లో పరుగుల వరద పారింది. కానీ... రెండే రోజుల వ్యవధిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ కోసం మరో పిచ్‌ను వినియోగిస్తున్నారు. ఇక్కడ సీమర్లకు అనుకూలం. ఈ రోజు చినుకులు కురిసే అవకాశం కూడా ఉంది.

జట్లు (అంచనా)
భారత్‌: ధావన్‌ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్, సంజూ సామ్సన్, దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్, శార్దుల్, సిరాజ్, చహల్, అవేశ్‌ ఖాన్‌/ప్రసిధ్‌ కృష్ణ.
వెస్టిండీస్‌: పూరన్‌ (కెప్టెన్‌), షై హోప్, కైల్‌ మేయర్స్, బ్రూక్స్‌/కార్టీ, బ్రాండన్‌ కింగ్, పావెల్, హోసీన్, షెఫర్డ్‌/కీమో పాల్, జోసెఫ్, సీల్స్, హేడెన్‌ వాల్‌‡్ష.

మరిన్ని వార్తలు