India vs Zimbabwe 1st ODI: శుభారంభం ఓపెనర్లతోనే...

19 Aug, 2022 04:41 IST|Sakshi
‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీపక్‌ చహర్‌

తొలి వన్డేలో భారత్‌ జయభేరి

గిల్, ధావన్‌ అజేయ అర్ధ సెంచరీలు

10 వికెట్లతో జింబాబ్వే చిత్తు

రేపు రెండో వన్డే  

వరుస పర్యటనలో, వరుస సిరీస్‌ వేటలో భారత్‌ శుభారంభం చేసింది. చాలా కాలం తర్వాత పునరాగమనం చేసిన దీపక్‌ చహర్‌ (3/27) బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ను బెంబేలెత్తిస్తే... విజయవంతమైన గిల్‌–ధావన్‌ ఓపెనింగ్‌ జోడి మరొకరికి చాన్స్‌ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది.
 
హరారే: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్, శిఖర్‌ ధావన్‌ అజేయ అర్ధసెంచరీల కంటే కూడా దీపక్‌ చహర్‌ స్పెల్‌ (7–0–27–3) ఈ మ్యాచ్‌లో హైలైట్‌. ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన చహర్‌ పిచ్‌ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొని వైవిధ్యమైన బంతులతో టాపార్డర్‌లో ఏ ఒక్కరిని పట్టుమని 10 పరుగులైనా చేయనివ్వలేదు. ఛేదన సులువయ్యేందుకు అతని స్పెల్‌ కారణమైంది. ఇదే పిచ్‌పై రెండు వారాల క్రితం వరుస మ్యాచ్‌ల్లో 290, 303 పరుగులు నమోదయ్యాయి. సులువుగా ఛేదించడం కూడా జరిగింది. అలాంటి పిచ్‌పై చహర్‌ బౌలింగ్‌ అసాధారణమనే చెప్పాలి. దీంతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ రెగిస్‌ చకాబ్వా (51 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచర్డ్‌ ఎన్‌గరవా (42 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఇవాన్స్‌ (29 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మన బౌలింగ్‌కు కాస్త ఎదురు నిలిచారు. స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్, సీమర్లు దీపక్‌ చహర్, ప్రసిధ్‌ కృష్ణ తలా 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ 30.5 ఓవర్లలో అసలు వికెట్టే కోల్పోకుండా 192 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌ (72 బంతుల్లో 82 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌), ధావన్‌ (113 బంతుల్లో 81 నాటౌట్‌; 9 ఫోర్లు) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించేశారు. చహర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభించింది. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది.

చహర్‌ దెబ్బకు ‘టాప్‌’టపా వికెట్లు
కొత్త బంతితో దీపక్‌ చహర్‌ చెలరేగాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో ఇన్నోసెంట్‌ కైయా (4)ను కీపర్‌ క్యాచ్‌తో పంపాడు. తన మరుసటి ఓవర్‌ తొలి బంతికి మరుమని (8)ని కూడా కీపర్‌ క్యాచ్‌తోనే పెవిలియన్‌ చేర్చాడు. వెస్లీ మదెవెర్‌ (5)ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. అంతకుముందు ఓవర్లో సిరాజ్‌... సియాన్‌ విలియమ్స్‌ (1) వికెట్‌ తీశాడు. జింబాబ్వే 31 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. మిడిలార్డర్‌ సంగతి ప్రసిధ్‌ కృష్ణ, అక్షర్‌ పటేల్‌ చూసుకోవడంతో ఒక దశలో జింబాబ్వే 110/8 స్కోరుతో ఆలౌట్‌కు దగ్గరైంది. బ్రాడ్‌ ఇవాన్స్, రిచర్డ్‌ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ఆమాత్రం స్కోరు చేయగలిగింది.

ఇద్దరే పూర్తి చేశారు
టాపార్డర్‌లో ఓపెనింగ్‌ను ఇష్టపడే కెప్టెన్‌ రాహుల్‌ తను కాదని విజయవంతమైన ధావన్‌–గిల్‌ జోడితోనే ఓపెన్‌ చేయించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శిఖర్‌–శుబ్‌మన్‌ జోడీ ఈ రెండు నెలల్లో మూడో శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. విండీస్‌ గడ్డపై కనబరిచిన జోరునే జింబాబ్వేపై కూడా కొనసాగించారు. మైదానంలో బౌండరీలు, భారత్‌కు పరుగులు వస్తున్నాయి కానీ పాపం ఆతిథ్య బౌలర్లకే వికెట్‌ గగనమైంది. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లతో వేయించిన ప్రయత్నం కూడా ఫలితాన్నివ్వలేదు. ముందుగా ధావన్‌ (76 బంతుల్లో 5ఫోర్లతో) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 20వ ఓవర్లో 100 పరుగులు దాటింది. శుబ్‌మన్‌ కూడా (51 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో భారత్‌ లక్ష్యాన్ని చేరేందుకు 30.5 ఓవర్లే సరిపోయాయి. దాదాపు 20 ఓవర్ల ముందే ఇద్దరే బ్యాటర్లు జట్టును
గెలిపించారు.

స్కోరు వివరాలు
జింబాబ్వే ఇన్నింగ్స్‌: కైయా (సి) సామ్సన్‌ (బి) చహర్‌ 4; మరుమని (సి) సామ్సన్‌ (బి) చహర్‌ 8; వెస్లీ (ఎల్బీ) (బి) చహర్‌ 5; సియాన్‌ విలియమ్స్‌ (సి) ధావన్‌ (బి) సిరాజ్‌ 1; సికందర్‌ రజా (సి) ధావన్‌ (బి) ప్రసిధ్‌ 12; చకాబ్వా (బి) అక్షర్‌ 35; రియాన్‌ బర్ల్‌ (సి) గిల్‌ (బి) ప్రసిధ్‌ 11; ల్యూక్‌ జాంగ్వే (ఎల్బీ) (బి) అక్షర్‌ 13; ఇవాన్స్‌ నాటౌట్‌ 33; రిచర్డ్‌ (బి) ప్రసిధ్‌ 34; విక్టర్‌ (సి) గిల్‌ (బి) అక్షర్‌ 8; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్‌) 189.
వికెట్ల పతనం: 1–25, 2–26, 3–31, 4–31, 5–66, 6–83, 7–107, 8–110, 9–180, 10–189.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 7–0–27–3, సిరాజ్‌ 8–2–36–1, కుల్దీప్‌ 10–1–36–0, ప్రసిధ్‌ 8–0–50–3, అక్షర్‌ 7.3–2–24–3.

భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ నాటౌట్‌ 81; శుబ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 82; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (30.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 192.
బౌలింగ్‌: రిచర్డ్‌ ఎన్‌గరవా 7–0–40–0, విక్టర్‌ 4–0–17–0, ఇవాన్స్‌ 3.5–0–28–0, సియాన్‌ 5–0–28–0, సికందర్‌ రజా 6–0–32–0, ల్యూక్‌ జాంగ్వే 2–0–11–0, వెస్లీ 2–0–16–0,
రియాన్‌ బర్ల్‌ 1–0–12–0. 

మరిన్ని వార్తలు