IND Vs WI: వీసా ఇచ్చేందుకు ససేమిరా‌.. అధ్యక్షుడి చొరవతో లైన్‌ క్లియర్‌

4 Aug, 2022 10:28 IST|Sakshi

టీమిండియా, వెస్టిండీస్‌ ఆటగాళ్ల వీసా సమస్యలు తొలిగిపోయాయి. టోర్నీలో భాగంగా చివరి రెండు టి20లు జరగనున్న ప్లోరిడాకు వెళ్లేందుకు ఆటగాళ్లకు మార్గం సుగమమైంది. గయానా అధ్యక్షుడి చొరవతో టీమిండియా, వెస్టిండీస్‌ ఆటగాళ్లకు సంబంధించిన వీసా ప్రక్రియ పూర్తైంది. ఇక గురువారం సాయంత్రం వరకు భారత్‌, విండీస్‌ ఆటగాళ్లు ప్లోరిడాకు చేరుకోనున్నారు. శనివారం(ఆగస్టు 6), ఆదివారం(ఆగస్టు 7) నాలుగు, ఐదు టి20లు జరగనున్నాయి. 

కాగా టోర్నీలో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరిగే అమెరికాకు వెళ్లేందుకు ఇరుజట్లు కలిపి 14 మందికి వీసా క్లియర్‌ కాలేదు. దీంతో బుధవారం ఇరుజట్లను గయానాలోని జార్జిటౌన్‌కు పంపించారు. గయానాలోని అమెరికా ఎంబసీలో ఆటగాళ్లకు వీసా అపాయింట్‌మెంట్స్‌ బుక్‌ చేయగా.. మొదట అమెరికా ఎంబసీ అడ్డుచెప్పింది. దీంతో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎంబసీ అధికారులతో చర్చించి ఆటగాళ్ల వీసాలకు సంబంధించిన ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు.

ఒక రకంగా ఆయన చొరవతోనే ఆటగాళ్లకు వీసా సమస్య తొలిగిపోయింది. ఈ సందర్భంగా గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీకి క్రికెట్‌ వెస్టిండీస్‌ బోర్డు(సీడబ్ల్యూఐ) కృతజ్ఞతలు తెలిపింది. సీడబ్ల్యూఐ అధ్యక్షుడు రికీ స్కెరిట్‌ మాట్లాడుతూ.. ''గయానా ప్రభుత్వం చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ జోక్యంతోనే ఇరుజట్ల ఆటగాళ్లకు వీసా క్లియరెన్స్‌ వచ్చింది. గయానా అధ్యక్షుడి నుంచి ఇది గొప్ప ప్రయత్నం'' అని పేర్కొన్నాడు.

ఇక ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌ టీమిండియా గెలవగా.. రెండో మ్యాచ్‌ విండీస్‌ గెలిచింది. ఇక మూడో టి20లో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెలరేగడంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకొని సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది.

చదవండి: విండీస్‌లో భారత్‌కు వింత పరిస్థితి.. లగేజీ మొదలు వీసా సమస్య వరకు

Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్‌.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ

మరిన్ని వార్తలు