‘పాలబుగ్గల’ పార్థివ్‌ రిటైర్‌

10 Dec, 2020 01:52 IST|Sakshi

అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన వికెట్‌ కీపర్‌  

న్యూఢిల్లీ: సుమారు 18 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌ పిచ్‌పై ఒక 17 ఏళ్ల కుర్రాడితో వికెట్‌ కీపర్‌గా అరంగేట్రం చేయించినప్పుడు క్రికెట్‌ ప్రపంచంలో చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో గంటన్నర పాటు నిలబడి మ్యాచ్‌ను ‘డ్రా’వైపు మళ్లించిన అతని పట్టుదలను చూసి ప్రత్యర్థులు కూడా అభినందించకుండా ఉండలేకపోయారు. తర్వాతి రోజుల్లో భారత క్రికెట్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆ కుర్రాడే పార్థివ్‌ పటేల్‌. సుదీర్ఘ కెరీర్‌ తర్వాత తాను అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు పార్థివ్‌ బుధవారం ప్రకటించాడు.

తన కెరీర్‌లో అండగా నిలిచిన బీసీసీఐ, గుజరాత్‌ క్రికెట్‌ సంఘానికి అతను కృతజ్ఞతలు తెలిపాడు. 2018 జనవరిలో చివరిసారిగా భారత జట్టుకు (దక్షిణాఫ్రికాపై) ప్రాతినిధ్యం వహించిన పార్థివ్‌... ఈ ఏడాది ఆరంభంలో సౌరాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీస్‌ మ్యాచ్‌లో ఆఖరిగా మైదానంలోకి దిగాడు. కీపర్‌గా ప్రతిభ, చక్కటి బ్యాటింగ్‌ నైపుణ్యం ఉన్నా... ధోని హవా కారణంగా ఎక్కువ కాలం జాతీయ జట్టుకు పార్థివ్‌ దూరం కావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ధోని తప్పుకోవడం వల్లో, సాహా గాయాల వల్లో కొన్ని అవకాశాలు వచ్చాయి. టీనేజర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అతను 35 ఏళ్ల వయసులో ఆట ముగించాడు.  

అంతర్జాతీయ క్రికెట్‌లో: పార్థివ్‌ అరంగేట్రం చేసిన నాటి నుంచి భారత్‌ ఆడిన 20 టెస్టుల్లో 19 మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కింది. అయితే కీలక సమయాల్లో కీపర్‌గా చేసిన తప్పిదాలతో జట్టులో స్థానం కోల్పో యాడు. 2002లో హెడింగ్లీ, 2003– 04లో అడిలైడ్‌లో భారత్‌ సాధిం చిన విజయాల్లో భాగంగా ఉన్న పార్థివ్‌... 2004లో రావల్పిండిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఓపెనర్‌గా వచ్చి 69 పరుగులు చేయడం చెప్పుకోదగ్గ ప్రదర్శన. 2012 తర్వాత పార్థివ్‌ వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చలేదు. అతను 2 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. 
 
ఐపీఎల్‌/దేశవాళీ క్రికెట్‌లో: ఐపీఎల్‌లో పార్థివ్‌ ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడగా మూడుసార్లు (2010లో చెన్నై తరఫున, 2015, 2017లో ముంబై తరఫున) టైటిల్‌ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన 2017 ఫైనల్లో చివరి బంతికి సుందర్‌ను రనౌట్‌ చేసిన దృశ్యం అభిమానులు మరచిపోలేనిది. 2020లో బెంగళూరు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. గుజరాత్‌ తరఫున అతను చిరస్మరణీయ ప్రదర్శన కనబర్చాడు. పార్థివ్‌ సారథ్యంలోనే గుజరాత్‌ మూడు ఫార్మాట్‌లలో (రంజీ ట్రోఫీ, విజయ్‌ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీ) విజేతగా నిలవడం విశేషం.

ఆరేళ్ల వయసులోనే తలుపు సందులో ఇరుక్కుపోవడంతో ఎడమచేతి చిటికెన వేలు కోల్పోయిన పార్థివ్‌... తొమ్మిది వేళ్లతోనే వికెట్‌ కీపర్‌గా రాణించడం చెప్పుకోదగ్గ అంశం.

భారత్‌ తరఫున పిన్న వయసులో అరంగేట్రం చేసిన వారిలో సచిన్, పీయూష్‌ చావ్లా, శివరామకృష్ణన్‌ తర్వాత పార్థివ్‌ది నాలుగో స్థానం. అయితే వికెట్‌ కీపర్‌గా మాత్రం ప్రపంచ క్రికెట్‌ మొత్తంలో అతనే అందరికంటే చిన్నవాడు.

భారత్‌ తరఫున పార్థివ్‌ 25 టెస్టుల్లో 31.13 సగటుతో 934 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతను 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 23.74 సగటుతో 736 పరుగులు సాధించిన పార్థివ్‌ ఖాతాలో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 30 క్యాచ్‌లు పట్టిన అతను 9 స్టంపింగ్‌లు చేశాడు.

మరిన్ని వార్తలు