ఇది గెలిస్తే చాలు...

6 Dec, 2020 02:43 IST|Sakshi

టి20 సిరీస్‌పై భారత్‌ దృష్టి

నేడు ఆస్ట్రేలియాతో రెండో టి20 మ్యాచ్‌

జోరు మీదున్న కోహ్లి సేన

ఆసీస్‌కు గాయాల బెడద

మధ్యాహ్నం గం. 1.40 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

కోహ్లి సేన ఆసీస్‌ గడ్డపై మొదట కంగారు పడింది. తర్వాత సిరీస్‌ (వన్డే) కోల్పోయింది. భారీ స్కోర్లను సమర్పించుకుంది. క్యాచ్‌ల్ని జారవిడిచింది. కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అట్టిపెట్టుకుంది. అందుకే చివరి వన్డేలో ఆస్ట్రేలియా జోరుకు బ్రేక్‌ వేసింది. తొలి టి20లో ఆల్‌రౌండ్‌ పంజా విసిరింది. ఇప్పుడు సిరీస్‌నే పట్టాలనే పట్టుదలతో భారత్‌ బరిలోకి దిగుతోంది.

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు నాలుగు జరిగాయి. తొలి రెండు వన్డేలు ఆసీస్‌ గెలిచింది. సిరీస్‌ను పట్టేసింది. తర్వాత భారత్‌ కూడా రెండు నెగ్గింది. ఆఖరి వన్డే సహా, తొలి టి20లో భారత్‌ ప్రతాపం చూపింది. గెలుపోటముల పరంగా సమమైనా... సిరీస్‌ ఫలితమే భారత్‌కు బాకీ ఉంది. అందుకే ఆతిథ్య జట్టులాగే కోహ్లి సేన కూడా ఆఖరిదాకా లాక్కెళ్లకుండా రెండో మ్యాచ్‌లోనే పొట్టి సిరీస్‌ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే రెండో టి20లో భారత్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్‌ విజయాల జోరులో ఉంటే... ఆస్ట్రేలియాను గాయాలు కలవరపెడుతున్నాయి.  

ధావన్, కోహ్లి రాణిస్తే...
వన్డే సిరీస్‌లో రాణించిన ధావన్, కెప్టెన్‌ కోహ్లి టి20 మ్యాచ్‌లో విఫలమయ్యారు. రెండో మ్యాచ్‌లో వీళ్లిద్దరు బ్యాట్‌ ఝుళిపిస్తే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద ఖాయం. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు ఈ ఇద్దరు జతయితే భారత్‌ దర్జాగా ఓ మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ గెలుచుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే బ్యాటింగ్‌ గతి తప్పింది. దీంతో మార్పు చేయాలనుకుంటే శ్రేయస్‌ అయ్యర్‌కు అవకాశం లభించొచ్చు. కానీ వన్డేల్లో అయ్యర్‌ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. హార్దిక్‌ పాండ్యా గత మ్యాచ్‌లో తక్కువ పరుగులే చేసినా... అతని ఫామ్‌ ఆసీస్‌లో బాగుంది. ఇతను కూడా మెరిపిస్తే భారత్‌ స్కోరును నిలువరించడం ముమ్మాటికి అసాధ్యమే!

జడేజా లోటు...
తొలి టి20లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వేగవంతమైన ఇన్నింగ్సే భారత్‌కు గౌరవప్రద స్కోరు అందించడమే కాకుండా బౌలర్లు పోరాడేందుకు అవకాశం కల్పించింది. కానీ గాయంతో అతను మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ముగియగానే పెవిలియన్‌ చేరాడు. ఇప్పుడైతే సిరీస్‌కే దూరమైన పరిస్థితి. బౌలింగ్‌లో అతని లోటును స్పిన్నర్‌ చహల్‌ భర్తీ చేసి ఉండవచ్చు. కానీ బ్యాటింగ్‌లో ఎవరుంటారనేది ప్రశ్నార్థకం. చహల్‌ పూర్తిగా బౌలర్‌. ఇతని కోసం ఓ బ్యాట్స్‌మన్‌ లోటు ఏర్పడుతుంది. దీన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఏలా అధిగమిస్తుందో చూడాలి. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే ధారాళంగా పరుగులు సమర్పించుకున్న షమీ స్థానంలో బుమ్రాను దించే అవకాశాలున్నాయి. వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌తో కట్టడి చేశాడు. వీళ్లిద్దరు సిడ్నీలోనూ అదరగొడితే భారత్‌కు విజయం సులువవుతుంది.

కంగారూ... కంగారూ...
ఆతిథ్య జట్టును గత ఫలితం, సిరీస్‌ భయమే కాదు... గాయాలు పట్టి పీడిస్తున్నాయి. ఇదివరకే డాషింగ్‌ ఓపెనర్‌ వార్నర్‌ పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫించ్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో ఈ మ్యాచ్‌ ఆడే అవకాశాల్లేవు. అతను గైర్హాజరైతే తాత్కాలిక సారథ్యాన్ని మాథ్యూ వేడ్‌కు అప్పగించవచ్చు. కానీ దూకుడుగా ఆడుతున్న ఓపెనర్‌ స్థానాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారు. వన్డేల్లో చెలరేగిన స్మిత్, మ్యాక్స్‌వెల్‌లను గత మ్యాచ్‌లో భారత బౌలర్లు తెలివిగా ఔట్‌ చేశారు. ఇదే ఆసీస్‌ ఫలితాన్ని మార్చేసింది. 56 పరుగులదాకా అజేయంగా సాగిన ఇన్నింగ్స్‌ తర్వాత్తర్వాత చతికిలబడింది. అయితే వేదిక మాత్రం ఆసీస్‌ను ఊరడిస్తుంది. ఇక్కడే జరిగిన తొలి రెండో వన్డేల్లో కంగారూ జట్టు జయభేరి మోగించింది. కాన్‌బెర్రా నిరాశపరిచినా... మళ్లీ సిడ్నీకి రావడంతో తిరిగి పుంజుకుంటామని ఆస్ట్రేలియా జట్టు ఆశిస్తోంది.

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రాహుల్, సామ్సన్, మనీశ్‌ పాండే/అయ్యర్, హార్దిక్‌ పాండ్యా, సుందర్, దీపక్‌ చహర్, నటరాజన్, బుమ్రా/షమీ, చహల్‌.
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌)/డార్సీ షార్ట్, వేడ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, క్యారీ, అబాట్, స్టార్క్, స్వెప్సన్‌/లయన్, జంపా, హజల్‌వుడ్‌.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌ అనుకూలమైన పిచ్‌. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు 300పైచిలుకు పరుగుల్ని అవలీలగా చేశాయి. ఇక ధనాధన్‌గా సాగే టి20 ఫార్మాట్‌లో అంతకుమించే ఉంటుంది. వర్షం బెడద లేదు.

మరిన్ని వార్తలు