గెలిపించిన హంపి

30 Aug, 2020 02:10 IST|Sakshi

చెస్‌ ఒలింపియాడ్‌ ఫైనల్లో భారత్‌

చెన్నై: తొలి మ్యాచ్‌లో పరాజయంపాలై ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌... విజేతను నిర్ణయించే టైబ్రేక్‌ గేమ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ కోనేరు హంపి అద్భుత ఆటతీరుతో సూపర్‌ ఫినిషింగ్‌ ఇచ్చింది. ‘అర్మగెడాన్‌’ పద్ధతిలో జరిగిన ఈ గేమ్‌లో హంపి 73 ఎత్తుల్లో మోనికా సోకో (పోలాండ్‌)ను ఓడించింది. దాంతో తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోలాండ్‌ జట్టుతో శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ టైబ్రేక్‌లో 1–0తో గెలిచింది.

రెండు మ్యాచ్‌లతో కూడిన సెమీఫైనల్లో తొలి మ్యాచ్‌లో భారత్‌ 2–4తో ఓడిపోయింది. విశ్వనాథన్‌ ఆనంద్, విదిత్, దివ్య దేశ్‌ముఖ్‌ ఓడిపోగా... నిహాల్‌ సరీన్‌ గెలిచాడు. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. ఇక ఫైనల్‌ చేరాలనే ఆశ ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 4.5–1.5తో నెగ్గి స్కోరును సమం చేసింది. హంపి, హారిక, ఆనంద్, విదిత్‌ తమ గేముల్లో గెలుపొందగా... ప్రజ్ఞానంద ఓడిపోయాడు. వంతిక అగర్వాల్‌ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఇక విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌లో ‘అర్మగెడాన్‌’ గేమ్‌ను ఆడించారు.

‘అర్మగెడాన్‌’ గేమ్‌ నిబంధనల ప్రకారం టాస్‌ గెలిచిన వారికి తెల్లపావులు లేదంటే నల్లపావులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. తెల్లపావులతో ఆడే వారికి ఐదు నిమిషాలు, నల్లపావులతో ఆడే వారికి నాలుగు నిమిషాలు ఇస్తారు. తెల్లపావులతో ఆడే వారికి అదనంగా ఒక నిమిషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు కచ్చితంగా గెలవాలి. మరోవైపు నల్లపావులతో ఆడేవారికి ఒక నిమిషం తక్కువ ఉంటుంది కాబట్టి వారు ‘డ్రా’ చేసుకున్నా చాలు వారినే విజేతగా ప్రకటిస్తారు. మోనికా సోకోతో జరిగిన అర్మగెడాన్‌ గేమ్‌లో హంపి టాస్‌ గెలిచి నల్ల పావులను ఎంచుకుంది. ‘డ్రా’ చేసుకుంటే సరిపోయే స్థితిలో హంపి చకచకా ఎత్తులు వేస్తూ, ప్రత్యర్థి వ్యూహాలు చిత్తు చేస్తూ 73 ఎత్తుల్లో ఏకంగా విజయాన్నే సొంతం చేసుకుంది. రష్యా, అమెరికా జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో నేడు జరిగే ఫైనల్లో భారత్‌ తలపడుతుంది. చెస్‌ ఒలింపియాడ్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం (2014లో). ఈసారి భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. 

మరిన్ని వార్తలు