వన్డే సమరానికి ‘సై’

27 Jun, 2021 05:56 IST|Sakshi

నేడు భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య తొలి మ్యాచ్‌

మధ్యాహ్నం గం. 3:00 నుంచి సోనీ టెన్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

బ్రిస్టల్‌: ఏడేళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో చక్కని పోరాటపటిమ కనబరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు అదే ఉత్సాహంతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి మ్యాచ్‌ జరుగుతుంది. ఇందులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని మిథాలీ సేన ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌తో భారత టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది.

2019లో టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన ఈ హరియాణా టాపార్డర్‌ బ్యాటర్‌ ఇంగ్లండ్‌ గడ్డపైనే ఇటీవల ఏకైక టెస్టు ఆడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీ (96, 63)లతో అదరగొట్టిన షఫాలీ ఇప్పుడు వన్డే కెరీర్‌కు గొప్ప ప్రారంభం ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సొంతగడ్డపై ఇంగ్లండ్‌ క్లిష్టమైన ప్రత్యర్థి. కెప్టెన్‌ హెదర్‌నైట్, బీమోంట్‌లతో పాటు బ్యాటింగ్‌ ఆల్‌ రౌండర్లు సీవర్, సోఫియా రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో కేట్‌ క్రాస్, ఎకిల్‌స్టోన్, ష్రబ్‌సోల్‌లతో ఈ విభాగం కూడా పటిష్టంగా ఉంది.  
ఇంగ్లండ్‌తో ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో తలపడిన భారత్‌ 30 మ్యాచ్‌ల్లో గెలిచింది. 37 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

మరిన్ని వార్తలు