Ind W Vs Aus W Pink Ball Test: భారత అమ్మాయిల ‘పింక్‌’ ఆట

30 Sep, 2021 05:28 IST|Sakshi

నేటి నుంచే ఆస్ట్రేలియాతో డే–నైట్‌ టెస్టు

15 ఏళ్ల తర్వాత టెస్టుల్లో ముఖాముఖి పోరు

ఉదయం గం. 10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

గోల్డ్‌కోస్ట్‌: భారత మహిళల జట్టు ‘పింక్‌’ టెస్టుకు ‘సై’ అంటోంది. ఆ్రస్టేలియాతో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే నాలుగు రోజుల టెస్టు నేటి నుంచి జరగనుంది. మిథాలీ రాజ్‌ బృందానికి డే–నైట్‌ టెస్టు కొత్తనుకుంటే... ఆసీస్‌తో ఆడటం కూడా ఒక రకంగా కొత్తే! ఎందు కంటే ఇరు జట్ల మధ్య సంప్రదాయ మ్యాచ్‌ జరిగి దశాబ్దంన్నరకాలం అవుతోంది. ఆఖరిసారిగా 2006లో ఇరు జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ముఖాముఖీ టెస్టు పోరుకు ఇప్పుడు సిద్ధమయ్యాయి.

కెపె్టన్‌ మిథాలీ రాజ్, వెటరన్‌ సీమర్‌ జులన్‌ గోస్వామి అప్పటి మ్యాచ్‌ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే! ఇక మ్యాచ్‌ విషయానికొస్తే భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు. ఇటీవల ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో మిథాలీ సేన చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్‌ సిరీస్‌ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత అమ్మాయిలకు ఇంగ్లండ్‌తో టెస్టు అనుభవం పైచేయి సాధించేందుకు దోహదం చేయొచ్చు.  

జట్లు (అంచనా)
భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, స్మృతి, పూనమ్‌ రౌత్‌/యస్తిక, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, తానియా, పూజ/శిఖా పాండే, జులన్, మేఘన, రాజేశ్వరి గైక్వాడ్‌.
ఆ్రస్టేలియా మహిళల జట్టు: మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), అలీసా హీలీ, బెత్‌ మూనీ, ఎలీస్‌ పెర్రీ, తాలియా, యాష్‌ గార్డెనెర్, సదర్లాండ్, సోఫీ, వేర్‌హామ్, డార్సీ బ్రౌన్, స్టెల్లా.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 5 టెస్టుల్లో గెలుపొందగా, నాలుగు ‘డ్రా’గా ముగిశాయి. భారత్‌ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు.

మరిన్ని వార్తలు