ఫీల్డింగ్‌లో మెరుగుపడాలి

22 May, 2021 01:56 IST|Sakshi

ఈ విభాగంలో భారత మహిళల జట్టుకంటే విదేశీ జట్లదే పైచేయి

టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మ వ్యాఖ్య

న్యూఢిల్లీ: విదేశీ జట్లపై నిలకడగా విజయాలు దక్కాలంటే భారత మహిళల క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ విభాగంలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. చాలాకాలం భారత అండర్‌–19 పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అభయ్‌ శర్మ... గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లో భారత మహిళల జట్టుకు తొలిసారి ఫీల్డింగ్‌ కోచ్‌గా వచ్చారు. చివరి నిమిషంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఏర్పాటు కావడం... జట్టు సభ్యులతో కలిసి పనిచేసేందుకు తగినంత సమయం కూడా లభించకపోవడంతో ఆయన ఫీల్డింగ్‌ విభాగంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్‌ పర్యటన మాత్రం అభయ్‌ శర్మ పనితీరు ఎలా ఉందనే విషయం తెలియజేస్తుంది.

ఈ పర్యటనలో భారత జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ‘ఫీల్డింగ్‌ విషయానికొస్తే చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మహిళల క్రికెట్‌లో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయాలంటే, పరుగులు ఎక్కువ ఇవ్వకూడదంటే ఫీల్డర్లు మైదానంలో ఎల్లవేళలా చురుకుగా కదలాల్సి ఉంటుంది. సాంకేతికంగా కూడా కొన్ని అంశాల్లో మనం మెరుగుపడాలి. ముఖ్యంగా త్రోయింగ్‌లో మన అమ్మాయిలు బలహీనంగా ఉన్నారు. కెరీర్‌ ఆరంభంలోనే మనం సరైన పద్ధతిలో శిక్షణ తీసుకోకపోతే ఆ తర్వాత మనకు ఇబ్బందులు ఎదురవుతాయి’ అని అభయ్‌ శర్మ విశ్లేషించారు. ‘విదేశీ మహిళా క్రికెటర్లతో పోలిస్తే మనం కొన్ని విభాగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నామని అంగీకరించాలి. దక్షిణాఫ్రికా అమ్మాయిలు మైదానంలో చురుకుగా కదులుతారు. శారీరకంగా కూడా విదేశీ మహిళా క్రికెటర్లు పటిష్టంగా ఉంటారు’ అని అభయ్‌ శర్మ వివరించారు.

మరిన్ని వార్తలు