IND-A Vs NZ-A: 178 పరుగులకే ఆలౌట్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌; సంజూ కెప్టెన్సీ అదరహో

27 Sep, 2022 20:10 IST|Sakshi

భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌-ఏ జట్టుకు భంగపాటే ఎదురైంది. న్యూజిలాండ్‌-ఏతో జరిగిన అనధికారిక మూడు వన్డేల సిరీస్‌ను సంజూ శాంసన్‌ కెప్టెన్సీలోని ఇండియా-ఏ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం చెన్నై వేదికగా జరిగిన అనధికారిక మూడో వన్డేలో ఇండియా-ఏ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌-ఏ 178 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ డానే క్లీవర్‌ ఒక్కడే 83 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా.. మిగిలినవారిలో మైకెల్‌ రిప్పన్‌ 29, చాడ్‌ బోవ్స్‌ 20 పరుగులు చేశారు. ఇండియా-ఏ బౌలర్లలో రాజ్‌ బవా నాలుగు వికెట్లతో చెలరేగగా..  రాహుల్‌ చహర్‌, కుల్దీప్‌ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. 

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఏ జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(54), తిలక్‌ వర్మ(50), శార్దూల్‌ ఠాకూర్‌(51) అర్థ సెంచరీలతో చెలరేగారు.కివీస్‌ బౌలర్లలో జాకోబ్‌ డఫీకి రెండు, మాథ్యూ ఫిషర్‌కు రెండు, జో వాకర్‌కు ఒకటి, మైఖేల్‌ రిప్పన్‌కు రెండు, రచిన్‌ రవీంద్రకు ఒక వికెట్‌ దక్కాయి. ఇక అనధికారిక వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇండియా-ఏ టెస్టు సిరీస్‌ను మాత్రం డ్రాతోనే సరిపెట్టుకుంది.

చదవండి: షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్‌ 9న డెడ్‌లైన్‌!

మరిన్ని వార్తలు