టీమిండియాకు ఓదార్పు విజయం

2 Dec, 2020 17:02 IST|Sakshi

కాన్‌బెర్రా : ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు ఓదార్పు విజయం దక్కింది. 303 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటింగ్‌లో ఆరోన్‌ ఫించ్‌ 75 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్‌ 59 పరగులతో రాణించాడు. ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్స్‌వెల్‌, అలెక్స్‌ క్యారీలు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ధాటిగా ఆడిన మ్యాక్స్‌వెల్‌ అర్థసెంచరీ సాధించడంతో ఆసీస్‌ మళ్లీ గెలుపు దిశగా పయనించింది. (చదవండి : క్రికెట్‌ ఆస్ట్రేలియాపై వార్నర్‌ అసంతృప్తి)

అయితే 38 పరుగులు చేసిన క్యారీ రనౌట్‌గా వెనుదిరిగినా.. మ్యాక్స్‌వెల్‌ ఉండడంతో ఆసీస్‌ గెలుపుపై ధీమాతో ఉంది. కానీ జట్టు స్కోరు 268 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ అవుట్‌ కావడంతో మ్యాచ్‌ టీమిండియా వైపు మొగ్గింది. ఆ తర్వాత కాసేపటికే 28 పరుగులు చేసిన ఆస్టన్‌ అగర్‌ అవుట్‌ కావడంతో భారత్‌ విజయం ఖాయమైంది. ఇక బౌలింగ్‌లో  శార్ధూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీయగా, తొలి మ్యాచ్‌ ఆడిన నటరాజన్‌ 2 వికెట్లు, బుమ్రా, జడేజా, కుల్దీప్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

అంతకముందు మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.  భారత బ్యాటింగ్‌లో హార్దిక్‌ పాండ్యా 92 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జడేజా 66, కోహ్లి 63 పరుగులతో రాణించారు. పాండ్యా, జడేజాలు కలిసి ఆరో వికెట్‌కు 150 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం టీమిండియా ఇన్నింగ్స్‌లో హైలెట్‌గా నిలిచింది. కాగా ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడిన భారత్‌ సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఇరు జట్ల మధ్య  మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 డిసెండర్‌ 4 శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనుంది. (చదవండి : 21 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు)

మరిన్ని వార్తలు