IND Vs WI 3rd T20 Highlights: సూర్య సంచలన ఇన్నింగ్స్‌.. మూడో టీ20లో భారత ఘన విజయం 

9 Aug, 2023 02:52 IST|Sakshi

మూడో టి20లో భారత్‌ ఘనవిజయం

7 వికెట్లతో విండీస్‌ చిత్తు

రాణించిన తిలక్‌ వర్మ

శనివారం నాలుగో టి20   

భారత టి20 బృందం ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది.  ముందుగా చక్కటి బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను కట్టడి చేసిన టీమ్‌ ఆ తర్వాత  సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. హిట్టర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగి విజయానికి బాటలు వేయగా, తిలక్‌ వర్మ మరో చక్కటి ఇన్నింగ్స్‌తో అండగా నిలిచాడు. సిరీస్‌లో ప్రత్యర్థి ఆధిక్యాన్ని టీమిండియా 2–1కి తగ్గించగా, ఇప్పుడు తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఆధిపత్యం కోసం ఇరు జట్లు అమెరికా వేదికగా తలపడతాయి.   

ప్రావిడెన్స్‌ (గయానా): వరుసగా రెండు పరాజయాల తర్వాత భారత్‌ కోలుకొని కీలక విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం విండీస్‌తో జరిగిన మూడో టి20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బ్రెండన్‌ కింగ్‌ (42 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రావ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 40 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, కుల్దీప్‌ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి.

అనంతరం భారత్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 83; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సత్తా చాటగా, హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (37 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. సూర్య, తిలక్‌ మూడో వికెట్‌కు 51 బంతుల్లోనే 87 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య నాలుగో టి20 శనివారం అమెరికాలోని లాడర్‌హిల్‌లో జరుగుతుంది.  

పావెల్‌ మెరుపులు... 
విండీస్‌కు ఓపెనర్లు కింగ్, కైల్‌ మేయర్స్‌ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. వీరిద్దరు 42 బంతుల్లో 50 పరుగులు జత చేశారు. అయితే అక్షర్‌ ఈ జోడీని విడదీయగా, చార్లెస్‌ (12) ఎక్కువసేపు నిలవలేదు.

పూరన్‌ (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిగా ఆడినా కుల్దీప్‌ చక్కటి బంతికి అతను స్టంపౌట్‌ అయ్యాడు. అదే ఓవర్లో కింగ్‌ను కూడా కుల్దీప్‌ పెవిలియన్‌ పంపడంతో విండీస్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. హెట్‌మైర్‌ (9) కూడా విఫలమైనా... పావెల్‌ దూకుడుతో చివరి 4 ఓవర్లలో ఆ జట్టు 46 పరుగులు జోడించగలిగింది. అర్ష్దీప్‌ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన పావెల్‌ ముకేశ్‌ వేసిన చివరి ఓవర్లోనూ మరో సిక్స్‌ కొట్టాడు.  

సూర్య ధనాధన్‌... 
తొలి అంతర్జాతీయ టి20లో యశస్వి జైస్వాల్‌ (1) ప్రభావం చూపలేకపోగా గిల్‌ (6) పేలవ ఫామ్‌ కొనసాగింది. అయితే తొలి రెండు బంతులను 4, 6గా మలచి సూర్య ధాటిగా మొదలు పెట్టగా, తిలక్‌ కూడా తొలి 5 బంతుల్లోనే 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. షెఫర్డ్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో 23 బంతుల్లోనే సూర్య అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా సూర్య దూకుడు కొనసాగగా... తిలక్‌ అండగా నిలిచాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న దశలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సూర్య వెనుదిరిగాడు. అయితే తిలక్, హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 20 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) అభేద్యంగా 31 బంతుల్లో 43 పరుగులు జత చేసి మ్యాచ్‌ను ముగించారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్‌ భారత్‌ తరఫున ఈ అవకాశం దక్కించుకున్న 105వ ఆటగాడిగా నిలిచాడు.  

100  అంతర్జాతీయ టి20ల్లో సూర్యకుమార్‌ 100 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. 1007 బంతుల్లోనే అతను 100 సిక్స్‌లు కొట్టడం విశేషం. అత్యధిక సిక్సర్ల జాబితాలో భారత్‌ తరఫున రోహిత్‌ (182), కోహ్లి (117) మాత్రమే అతనికంటేముందున్నారు.   

స్కోరు వివరాలు  
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కింగ్‌ (సి అండ్‌ బి) కుల్దీప్‌ 42; మేయర్స్‌ (సి) అర్ష్దీప్‌ (బి) అక్షర్‌ 25; చార్లెస్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 12; పూరన్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) కుల్దీప్‌ 20; పావెల్‌ (నాటౌట్‌) 40; హెట్‌మైర్‌ (సి) తిలక్‌ (బి) ముకేశ్‌ 9; షెఫర్డ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–55, 2–75, 3–105, 4–106, 5–123. బౌలింగ్‌: పాండ్యా 3–0–18–0, అర్ష్దీప్‌ 3–0–33–0, అక్షర్‌ 4–0–24–1, చహల్‌ 4–0–33–0, కుల్దీప్‌ 4–0–28–3, ముకేశ్‌ 2–0–19–1. 
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) జోసెఫ్‌ (బి) మెకాయ్‌ 1; గిల్‌ (సి) చార్లెస్‌ (బి) జోసెఫ్‌ 6; సూర్యకుమార్‌ (సి) కింగ్‌ (బి) జోసెఫ్‌ 83; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 49; పాండ్యా (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–6, 2–34, 3–121. బౌలింగ్‌: మెకాయ్‌ 2–0–32–1, హొసీన్‌ 4–0– 31–0, జోసెఫ్‌ 4–0–25–2, ఛేజ్‌ 4–0–28–0, షెఫర్డ్‌ 3–0–36–0, పావెల్‌ 0.5–0–10–0.  

మరిన్ని వార్తలు