IND vs SL: మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. 317 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం

15 Jan, 2023 19:57 IST|Sakshi

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. కాగా ప్రపంచ వన్డే క్రికెట్‌ చరిత్రలోనే పరుగుల తేడాతో ఇదే భారీ విజయం కావడం విశేషం. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్‌ ఆషాన్‌ బండారకు గాయం కావడంతో బ్యాటింగ్‌కు రాలేదు.

దీంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. లంక​బ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌  50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్‌ శుబ్‌మాన్‌ గిల్‌ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(42), శ్రేయస్‌ అయ్యర్‌(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్‌ సాధించాడు.
చదవండిIND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!

మరిన్ని వార్తలు