‘షటిల్‌’ ఎగరడమే ముఖ్యం!

23 Dec, 2020 05:20 IST|Sakshi

ఫలితాల గురించి అప్పుడే ఆలోచించవద్దు

ద్వితీయ శ్రేణి ఆటగాళ్లపై కరోనా దెబ్బ

భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయం

కరోనా కారణంగా ఆగిపోయిన క్రీడా ప్రపంచం మళ్లీ దారిలోకి పడుతున్న వేళ వచ్చే జనవరిలో ఒకే వేదికపై మూడు టోర్నీలు ఆడేందుకు భారత బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే  ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఆట జరగడమే సంతోషించదగ్గ పరిణామమని, అంతా బాగున్నట్లు అనిపిస్తేనే మరిన్ని టోర్నమెంట్‌లకు అవకాశం ఉంటుందని భారత చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డారు. కోవిడ్‌–19 కారణంగా స్తబ్దత ఏర్పడినా... అగ్రశ్రేణి ఆటగాళ్లు దానిని తట్టుకోగలిగారని, తర్వాతి స్థాయిలోని ప్లేయర్ల కెరీర్‌పై మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన అన్నారు. తాజా పరిణామాలపై ‘సాక్షి’తో గోపీచంద్‌ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...                        
 –సాక్షి, హైదరాబాద్‌

మన ఆటగాళ్లలో దాదాపు అందరికీ మార్చిలో జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీనే చివరిది. శ్రీకాంత్‌ సహా మరికొందరు మాత్రం ఆ తర్వాత డెన్మార్క్‌ ఓపెన్‌లో ఆడారు. అయితే భారత షట్లర్లందరూ కరోనా కష్టకాలం తర్వాత మొదటిసారి ఒక మేజర్‌ టోర్నీలో ఆడనున్నారు. బ్యాంకాక్‌లో రెండు సూపర్‌–1000 టోర్నీలు, ఆ తర్వాత బీడబ్లూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ ఉన్నాయి. అక్కడ కోవిడ్‌–19 కేసుల సంఖ్య ఇతర బ్యాడ్మింటన్‌ దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండటంతో ఒకే చోట మూడు టోర్నీలకు అవకాశం కల్పించారు. 2020లో తక్కువ టోర్నమెంట్‌లు జరిగినా... వాటి ఆధారంగానే ఫైనల్స్‌ కోసం పాయింట్లు తీసుకుంటున్నారు. జనవరి 3న షట్లర్లు థాయ్‌లాండ్‌ చేరుకొని వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత బయో బబుల్‌ వాతావరణంలోనే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే ఫుట్‌బాల్, టెన్నిస్‌లాంటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక బ్యాడ్మింటన్‌ మాత్రం ఎందుకు ఆగాలి? కొంత ‘రిస్‌్క’ ఉన్న మాట వాస్తవమే అయినా ఎంత కాలం ఆడకుండా ఉండగలరు? 

సన్నాహాలపై...
మా అకాడమీకి చెందిన ఆటగాళ్లు అన్ని జాగ్రత్తలతో సాధన చేస్తున్నారు. సీనియర్లు రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌కు హాజరవుతున్నారు. వీరిపై దృష్టి పెట్టేందుకు అకాడమీలో ఇతర ఆటగాళ్ల సంఖ్యను ప్రస్తుతానికి బాగా తగ్గించాం. హాస్టల్‌లో కూడా తక్కువ వయసువారిని ఎవరినీ అనుమతించడం లేదు. సింధు కూడా లండన్‌లో తన ప్రాక్టీస్‌ బాగా సాగుతోందని సమాచారమిచ్చింది. అయితే ఇప్పుడున్న స్థితిలో అద్భుత ప్రదర్శనలు వస్తాయని ఆశించరాదు. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో కోర్టులో ఆడటం అంత సులువు కాదు. ఫలితాలకంటే ఆట జరుగుతోందని సంతోషించాల్సిన సమయమిది.   

చీఫ్‌ కోచ్‌ బాధ్యతల నిర్వహణపై... 
ఎప్పటి వరకు కోచ్‌గా కొనసాగాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అధికారికంగా 2022 వరకు నా పదవీ కాలం ఉంది. ప్రత్యేకంగా విదేశీ కోచ్‌లను నియమించుకున్న తర్వాత నాపై కొంత భారం తగ్గింది. ప్రస్తుతం ముగ్గురు ఇండోనేసియన్లు, ఒక కొరియన్‌ కోచ్‌ మన జట్టుతో పని చేస్తున్నారు. టోర్నీలకు కూడా వారే వెళ్తుండటంతో ఇతర ఆటగాళ్లపై మరింతగా దృష్టి పెట్టేందుకు నాకు తగినంత సమయం లభిస్తోంది.  

కరోనా తర్వాత ఆట పరిస్థితి... 
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడింది. అందులో క్రీడలు కూడా ఒకటి. అయితే వ్యక్తిగత క్రీడ అయిన బ్యాడ్మింటన్‌ను విడిగా చూస్తే... అగ్రశ్రేణి షట్లర్లకు పెద్దగా సమస్యలు రాలేదు. నా విశ్లేషణ ప్రకారం ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది స్పాన్సర్‌షిప్‌లు కోల్పోయారు. పలువురిని కంపెనీలు ఉద్యోగాల్లోంచి తొలగించాయి. కొన్నాళ్ల క్రితం వరకు క్రీడాకారులకు అమిత గౌరవం ఇచ్చిన కార్పొరేట్‌ కంపెనీలు కూడా తమ నష్టాలు చూపిస్తూ వారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాయి. 2021లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.

గోపీచంద్‌పై డాక్యుమెంటరీ 
అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆధ్వర్యంలోని అధికారిక ఓటీటీ సంస్థ ‘ఒలింపిక్‌ చానల్‌’ పుల్లెల గోపీచంద్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో షూట్‌ కొనసాగుతోంది. గోపీచంద్‌ ఇస్తున్న శిక్షణ, ఆటగాళ్లు సాధించిన ఫలితాలు, ఆయన ఇద్దరు శిష్యులు (సైనా, సింధు) ఒలింపిక్‌ పతకాలు గెలుచుకోవడం వరకు వివిధ అంశాలు ఇందులో ఉంటాయి. 

మరిన్ని వార్తలు