'పంత్‌ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు

23 Jan, 2023 10:38 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గతేడాది డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్‌ ముంబైలోకి కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పంత్‌కు పలు సర్జరీలు నిర్వహించిన వైద్యులు అతను కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంత్‌ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ గుడిలో పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ గుడి ఒకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

న్యూజిలాండ్‌తో మూడో వన్డే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మంగళవారం జరగనుంది. మ్యాచ్‌ కోసం టీమిండియా, కివీస్‌ జట్లు ఇప్పటికే ఇండోర్‌కు చేరుకున్నాయి. కాగా సోమవారం ఉదయం భారత క్రికెటర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా పంత్‌ త్వరగా కోలుకోవాలంటూ మహాశివుడికి పూజలు నిర్వహించారు. అనంతరం శివ లింగానికి బాబా మహాకాల్‌ భస్మ హారతి అర్పించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ఏఎన్‌ఐ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. 

సూర్యకుమార్‌ మాట్లాడుతూ.. ''కారు ప్రమాదానికి గురైన పంత్‌ త్వరగా కోలుకోవాలని పరమ శివుడిని ప్రార్థించాం. ఆయన దీవెనలతో పంత్‌ కోలుకొని టీమిండియా జట్టులోకి తిరిగి రావడం మాకు చాలా ముఖ్యం. ఇక ఇప్పటికే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలిచాం.. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: 'కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం'

మరిన్ని వార్తలు