పాక్‌లో పుట్టాడు.. భారత్‌లో ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు 

26 Jul, 2021 21:05 IST|Sakshi

న్యూఢిల్లీ: 33 టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి తరం మేటి ఆల్‌రౌండర్‌ లేట్‌ జి.ఎస్. రాంచంద్ గురించి బహుశా నేటి తరంలో ఎవ్వరికీ తెలిసుండకపోవచ్చు. కమర్షియల్‌ బ్రాండ్‌ల ఎండార్స్‌మెంట్లకు ఆధ్యుడైన ఈ భారత మాజీ క్రికెటర్‌.. అంతర్జాతీయ వేదికపైనే కాకుండా భారత దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఇవాళ(జులై 26) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్‌లోని విశేషాలపై ఓ లుక్కేద్దాం. రాంచంద్ పుట్టింది దాయాది దేశం పాక్‌లోనే అయినా భారత్‌ తరఫున క్రికెట్‌ ఆడాడు. 1927 జూలై 26న కరాచీలో జన్మించిన రాంచంద్.. ఇంగ్లండ్‌పై తన కెరీర్‌ను ప్రారంభించాడు. 

అయితే తాను ఆడిన తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌ 1952లో లీడ్స్ వేదికగా జరిగింది. ఇలా తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరగడంతో అతని కెరీర్‌ ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే, రాంచంద్‌ మాత్రం ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సత్తా చాటి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఆ తర్వాత కాలంలో వెనక్కు తిరగి చూసుకోని రాంచంద్‌.. 1952 నుంచి 1960 వరకు దాదాపు ఎనిమిదేళ్లపాటు భారత్‌ జట్టులో కొనసాగాడు. ఈ మధ్యలో అతను భారత జట్టుకు సారధ్యం వహించాడు. ఇతని నాయకత్వంలోనే భారత్‌.. ఆసీస్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. 

ఇక రాంచంద్‌ కెరీర్‌ గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. 33 టెస్ట్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 1180 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 41 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో బాంబే జట్టుకు ప్రాతినధ్యం వహించిన రాంచంద్‌.. 16 శతకాలు, 28 అర్ధశతకాల సాయంతో 6026 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో రాంచంద్‌ 9సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి మొత్తంగా 255 వికెట్లు పడగొట్టాడు. విజయ్‌ హాజారే, విజయ్‌ మంజ్రేకర్‌ లాంటి దిగ్గజ క్రికటర్ల సమాకాలీకుడైన రాంచంద్‌.. 50వ దశకంలో భారత మేటి ఆల్‌రౌండర్‌గా కొనసాగాడు. సెప్టెంబర్‌ 8 2003లో 76 ఏళ్ల వయసులో రాంచంద్‌ మరణించాడు.    

మరిన్ని వార్తలు