రవిశాస్త్రి ఎలెవెన్‌తో మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి ఫ్యాన్స్ విజ్ఞప్తి

19 Jul, 2021 18:52 IST|Sakshi

కొలొంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న గబ్బర్ సేన తొలి వన్డేలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో భారత క్రికెట్‌ అభిమానులు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు.. ద్రవిడ్‌ పర్యవేక్షణలోని భారత యువ జట్టుకు మధ్య మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో ఉన్న భారత రెగ్యులర్‌ జట్టుకు రవిశాస్త్రి హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఎలెవెన్‌-ద్రవిడ్‌ ఎలెవెన్‌ మధ్య పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ప్లాన్‌ చేయాలని బీసీసీఐని కోరుతున్నారు. అవసరమైతే ప్రస్తుత లంక పర్యటనను రద్దు చేసైనా ఈ మ్యాచ్‌లు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే కోహ్లీ సేనలో ఉన్న రోహిత్‌ శర్మను ద్రవిడ్‌ జట్టులోకి తీసుకొచ్చి.. ప్రస్తుతం ధవన్‌ అండ్‌ కో లో ఉన్న పడిక్కల్‌ను వారికి ఇవ్వాలని ఆసక్తికర ప్రతిపాదనలు చేస్తున్నారు. భారత క్రికెట్‌ అభిమానులు చేస్తున్న ఈ సరికొత్త ప్రతిపాదన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలోనే గబ్బర్‌ సేన 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. పేరుకు ద్వితీయ శ్రేణి జట్టయినా ఊహించినట్టుగానే పూర్తి ఆధిపత్యం చలాయించింది. శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.4 ఓవర్లలోనే చేధించి ఔరా అనిపించింది.

బర్త్ డే బాయ్ ఇషాన్ కిషన్(42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో వన్డే కెరీర్‌ను ప్రారంభించగా.. ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) ధనాధన్ బ్యాటింగ్‌తో సెహ్వాగ్‌ను తలపించాడు. ఈ ఇద్దరికి శిఖర్ ధవన్ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో భారత యువ జట్టు చిరస్మరణీయ విజయాన్నందుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ధవన్‌ సేన 1-0 ఆధిక్యంలోకి ఉండగా, ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు