భారత ఫీల్డర్లు ఏదో అనేవారు.. కానీ

6 Aug, 2020 20:39 IST|Sakshi

దానికి అర్థం ఎప్పుడూ చెప్ప లేదు

ఒ‍కే పదాన్ని ఉపయోగించేవారు

గత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్న గిల్‌క్రిస్ట్‌

సిడ్నీ: భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య గతంలో జరిగిన సిరీస్‌ల గురించి ప‍్రస్తావిస్తే మనకు హర్భజన్‌ సింగ్‌ ‘మంకీగేట్‌’ వివాదమే మనకు గుర్తుకొస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాడు సైమండ్స్‌ను ఉద్దేశిస్తూ భజ్జీ చేసిన కామెంట్‌ ఒకానొక సమయంలో పెద్ద దుమారం రేపింది. అయితే ఆ వివాదం పెద్దది కాకుండా చేయడంలో సచిన్‌ టెండూల్కర్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే హర్భజన్‌ సింగ్‌ తనను ఔట్‌ చేసిన సందర్భంలో భారత ఫీల్డర్లు ఒకే పదాన్ని ఎక్కువ ఉపయోగించేవారని ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ గుర్తు చేసుకున్నాడు. లైవ్‌ కనెక్ట్‌ షోలో భాగంగా టీవీ ప్రెజంటర్‌ మడోనా టిక్సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ల విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు గిల్‌క్రిస్ట్‌. (24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ ఓపెనర్‌గా..)

ఈ క్రమంలోనే ఒకనాడు భారత ఫీల్డర్‌ ఉపయోగించే ఆ పదానికి అర్థం ఏమిటో ఇప్పటికీ తెలీదన్నాడు. ఇప్పుడు ఆ పదాన్ని కూడా మరిచిపోయానని గిల్లీ చెప్పుకొచ్చాడు. ప్రధానంగా భజ్జీ బౌలింగ్‌లో తాను ఔటైన సందర్భంలోనే ఆ పదాన్ని వాడేవారన్నాడు. 2001 సిరీస్‌లో ఆసీస్‌కు చుక్కలు చూపించిన హర్భజన్‌.. మూడు టెస్టుల సిరీస్‌లో 32 వికెట్లు సాధించి భారత్‌కు సింగిల్‌ హ్యాండ్‌ విజయం అందించాడు. కాగా, భజ్జీ తన టెస్టు కెరీర్‌లో అత్యధికంగా ఔట్‌ చేసిన వారిలో పాంటింగ్‌(10సార్లు) తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో మాధ్యూ హేడెన్‌(9సార్లు), గిల్‌ క్రిస్ట్‌(7సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. (ఐపీఎల్‌ కొత్త టైటిల్‌ స్పాన్సర్‌ ఎవరు?)

ఇక భారత్‌లో ఎప్పుడూ తమకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ ఉండేదని గిల్లీ గుర్తు చేసుకున్నాడు. అయితే ముంబైలో తనకు ఎదురైన ఫన్నీ ఘటనను గిల్లీ ప్రస్తావించాడు. ఒక మార్నింగ్‌ తాను ఒకచోట జాగింగ్‌ చేస్తుంటే క్రికెట్‌ ఫ్యాన్స్‌ పరుగులు పెట్టించారన్నాడు. తాను సన్‌గ్లాసెస్‌, ఇయర్‌ ఫోన్స్‌, తలపై హ్యాట్‌ పెట్టుకోవడమే కాకుండా తల కిందకు వంచి జాగింగ్‌ చేసుకుంటుంటే కొంతమంది తనను ఆపేశారన్నాడు. ఈ క్రమంలో తనను గుర్తించి ఒక ఫోటో కోసం వెంటపడ్డారన్నాడు. ఇది చాలా సరదాగా అనిపించిందని గిల్లీ పేర్కొన్నాడు. తాను మళ్లీ ఎప్పుడు భారత్‌కు వస్తానో తెలీదన్న గిల్లీ.. భారత్‌కు రావడమంటే ఎప్పుడూ కొత్తగా ఉంటుందన్నాడు.

మరిన్ని వార్తలు