Hockey Asia Champions Trophy: ఆట ఏదైనా పాక్‌పై భారత్‌దే పైచేయి 

18 Dec, 2021 07:32 IST|Sakshi

ఢాకా: మూడుసార్లు చాంపియన్‌ భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో దూకుడు కనబరుస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3–1 గోల్స్‌ తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. దాంతో టోర్నీలో రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో మొత్తం ఏడు పాయింట్లు సాధించిన టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

భారత వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ (8వ, 53వ నిమిషాల్లో) చేయగా... మరో గోల్‌ను ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (42వ నిమిషంలో) చేశాడు. పాకిస్తాన్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జునైద్‌ మన్‌జూర్‌ (45వ నిమిషంలో) చేశాడు. గత ఐదేళ్లలో పాక్‌తో జరిగిన 12 మ్యాచ్‌ల్లో భారత్‌ 11 గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఆదివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ ఆడనుంది.

మరిన్ని వార్తలు