భారత జట్టుకు నిరాశ 

6 Jan, 2021 08:33 IST|Sakshi
భారత హాకీ క్రీడాకారులు(కర్టెసీ: హాకీ ఇండియా)

దక్షిణాఫ్రికాలో ‘సమ్మర్‌ సిరీస్‌’ హాకీ టోర్నీ రద్దు

న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో అంతర్జాతీయ సిరీస్‌ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తోన్న భారత పురుషుల హాకీ జట్టు నిరీక్షణ మరికొంత కాలం కొనసాగనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి పెరగడంతో కేప్‌టౌన్‌ వేదికగా ఈనెల 10 నుంచి 27 వరకు జరగాల్సిన ‘సమ్మర్‌ సిరీస్‌’ను రద్దు చేసినట్లు దక్షిణాఫ్రికా హాకీ సంఘం (ఎస్‌ఏహెచ్‌ఏ) సీఈఓ మరిస్సా లాంజెనీ ప్రకటించారు. బెల్జియం, బ్రిటన్, ఫ్రాన్స్, భారత్‌ పాల్గొనే ఈ సిరీస్‌ను తాజా పరిస్థితుల్లో సిరీస్‌ను నిర్వహించడం ప్రమాదంతో కూడుకున్నదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని హాకీ ఇండియా మంగళవారం ధ్రువీకరించింది. భారత జట్టు చివరగా గతేడాది ఫిబ్రవరి 21–22 తేదీల్లో ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్‌లు ఆడింది.(చదవండి: పాక్‌ మరో 354 పరుగులు చేస్తేనే.. లేదంటే )

ఎదురులేని ముంబై
మార్గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) ఎదురు లేకుండా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో నెగ్గిన ముంబై తాజాగా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 3–1 గోల్స్‌ తేడాతో బెంగళూరు ఎఫ్‌సీపై గెలుపొందింది. ముంబై ఆటగాళ్లు ఫాల్‌ (9వ నిమిషంలో), బిపిన్‌ సింగ్‌ (15వ నిమిషంలో), ఒగ్బెచె (84వ నిమిషంలో) తలా ఓ గోల్‌ చేశారు. బెంగళూరు తరఫున చెత్రి (79వ నిమిషంలో) పెనాల్టీ ద్వారా గోల్‌ చేశాడు. నేటి మ్యాచ్‌లో ఈస్ట్‌ బెంగాల్‌తో ఎఫ్‌సీ గోవా తలపడుతుంది.

మరిన్ని వార్తలు