భారత్‌ ‘డబుల్‌’ ధమాకా

22 Mar, 2021 16:40 IST|Sakshi

పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు స్వర్ణాలు

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ

న్యూఢిల్లీ: మరోసారి తమ సత్తా నిరూపించుకుంటూ భారత షూటర్లు ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో మూడో రోజు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళల, పురుషుల టీమ్‌ ఈవెంట్స్‌లో టీమిండియాకు రెండు పసిడి పతకాలు లభించాయి. యశస్విని, మనూ భాకర్, శ్రీనివేథాలతో కూడిన భారత మహిళల ఎయిర్‌ పిస్టల్‌ జట్టు ఫైనల్లో 16–8 స్కోరుతో జులీటా బొరెక్, జోనా ఐవోనా, అగ్నెస్కాలతో కూడిన పోలాండ్‌ జట్టుపై గెలిచింది.

సౌరభ్, రిజ్వీ, అభిషేక్‌ వర్మలతో కూడిన భారత పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ జట్టు ఫైనల్లో 17–11 స్కోరుతో దిన్‌ తాన్, క్వాక్‌ ట్రాన్, చుయెన్‌ ఫాన్‌లతో కూడిన వియత్నాం జట్టును ఓడించింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో దీపక్, పంకజ్, ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌లతో కూడిన భారత బృందానికి రజతం లభించింది. ఫైనల్లో టీమిండియా 14–16 స్కోరుతో లుకాస్, విలియమ్, షెర్రీలతో కూడిన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది.

మహిళల స్కీట్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ గనేమత్‌ సెఖోన్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆరుగురి మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో గనేమత్‌ 40 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ చరిత్రలో స్కీట్‌ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా గనేమత్‌ గుర్తింపు పొందింది. మూడో రోజు పోటీలు ముగిసిన తర్వాత భారత్‌ మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 

మరిన్ని వార్తలు