గందరగోళం.. 14 లేదా 17న...

8 Jul, 2021 04:07 IST|Sakshi

భారత ఒలింపిక్‌ బృందం టోక్యో పయనంపై గందరగోళం  

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో కూడా భారత బృందం టోక్యో వెళ్లే తేదీ విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆటగాళ్లు ఈ నెల 14న వెళతారా లేక 17న అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆటగాళ్లంతా 17న బయల్దేరతారని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా మూడు రోజుల క్రితం ప్రకటించగా, 14న పయనం కావాల్సి ఉందంటూ తాజాగా అదే ఐఓఏ నుంచి ఆటగాళ్లు, క్రీడా సమాఖ్యలకు మెసేజ్‌ వచ్చింది.

నిబంధనల ప్రకారం స్వదేశం నుంచి బయల్దేరే ముందు వరకు వరుసగా ఏడు రోజుల పాటు అథ్లెట్లు ఆర్‌టీ–పీసీఆర్‌ కోవిడ్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. 14న బయల్దేరాలంటే కచ్చితంగా బుధవారం నుంచే వారి కోవిడ్‌ పరీక్షలు ప్రారంభం కావాలి. ఆలస్యమైతే మరో మూడు రోజులు అదనంగా పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా జూలై 23 నుంచే ఆర్చరీ పోటీలు జరుగుతాయి కాబట్టి ఆర్చర్లు ఇక్కడ ముందుగానే సాధన నిలిపేయాల్సి ఉంటుంది. ఈ గందరగోళ పరిస్థితిని నివారించి తమకు పక్కా సమాచారం అందించాలని వివిధ క్రీడా సమాఖ్యలు ఐఓఏను కోరుతున్నాయి. మరోవైపు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్ల విషయంలోనైతే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా... ఎప్పుడైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, 24 గంటల ముందు మాత్రమే తెలియజేస్తామని చెప్పడం విశేషం.   
 

మరిన్ని వార్తలు