ఢిల్లీకి చేరిన ఒలింపిక్స్‌ బృందం.. ఐఓఏ అధికారుల ఘన స్వాగతం

9 Aug, 2021 18:22 IST|Sakshi

ఢిల్లీ: భారత ఒలింపిక్స్‌ బృందం  సోమవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఒలింపిక్స్‌ కీడ్రాకారులకు ఐఓఏ అధికారులు ఘన స్వాగతం పలికారు. ​కాగా ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ ముగిసాయి. కోవిడ్‌ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహించారు. 

ఇక ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్‌ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా పీవీ సింధు రికార్డులకెక్కింది. ఇక ఆర్మీ నాయక్‌ సుబేదార్‌ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్‌) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్‌ పాజిబుల్‌’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్‌ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు.

రవి దహియా 57 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో  రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. మరోవైపు భారత హకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. మన్‌ప్రీత్‌ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ అడ్డుగోడ, స్ట్రయికర్‌ సిమ్రన్‌జీత్‌ సింగ్‌ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. ఇక అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. దిగ్గజం మేరీకోమ్‌ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. అంతేకాకుండా ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా కాంస్యంతో మురిపించాడు.
 

మరిన్ని వార్తలు