టీమిండియాకు శుభవార్త.. ఆ మ్యాచ్‌ అయ్యాక 20 రోజులు రిలాక్స్‌ 

8 Jun, 2021 16:12 IST|Sakshi

సౌథాంప్టన్‌: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్‌ అయ్యాక 20 రోజుల పాటు రిలాక్స్‌ అయ్యే వెసులుబాటును కల్పించాలని నిర్ణయించింది. అంటే కోహ్లీ సేన జూన్‌ 23న బయో బబుల్‌ను వీడితే, తిరిగి జులై 14న బుడగలోకి ప్రవేశిస్తుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం ఎక్కడ గడుపుతారన్నది(యూకే పరిధిలోనే) వారి వ్యక్తిగత విషయమని బీసీసీఐ తేల్చింది. నాలుగున్నర నెల‌ల పాటు సాగే సుదీర్ఘ ప‌ర్యట‌న‌ కావడంతో ఆటగాళ్లకు ఈ బ్రేక్‌ ఊరట కలిగించే అంశమని, ఈ సమయాన్ని క్రికెటర్లు కుటుంబం సభ్యులతో కలిసి ఆస్వాధించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోను జట్టు సభ్యులంతా జులై 14న తిరిగి భారత క్యాంప్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

కాగా, జూన్‌ 2న ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరేముందు ముంబైలో రెండు వారాలు క్వారంటైన్‌లో గడిపిన టీమిండియా సభ్యులు, ఇంగ్లండ్‌లో దిగిన త‌ర్వాత మళ్లీ మూడు రోజులు క్వారంటైన్‌లో గడిపారు. ఈ సమయంలో వారు ఒకరినొకరు కలుసుకునే అవకాశం కూడా లభించలేదు. ఇలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్న తర్వాత బ‌యో బబుల్ నుంచి 20 రోజుల బ్రేక్ ల‌భించ‌డమనేది టీమిండియాకు ఊర‌ట క‌లిగించే అంశమే. ఇదిలా ఉంటే, ఆగస్ట్‌ 4న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ముగిసాక, టీమిండియా క్రికెటర్లంతా మ‌ళ్లీ ఐపీఎల్ బ‌బుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ 20 రోజులు వాళ్లకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం రావ‌డం మాన‌సికంగా ఉల్లాసానికి గురి చేసే విషయమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.  
చదవండి: శభాష్‌ విహారి.. నువ్వు నిజంగా చాలా గ్రేట్‌ గురూ

మరిన్ని వార్తలు