బ్యాడ్మింటన్‌కు వేళాయె!

13 Oct, 2020 06:01 IST|Sakshi

నేటి నుంచి డెన్మార్క్‌ ఓపెన్‌ టోర్నీ

ఒడెన్స్‌ (డెన్మార్క్‌): కరోనా వైరస్‌ కారణంగా మార్చి నెల రెండో వారం నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లు నిలిచిపోయాయి. ఏడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సందడి మొదలుకానుంది. నేటి నుంచి డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌ జరగనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు లక్ష్య సేన్, అజయ్‌ జయరామ్, శుభాంకర్‌ డే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సరైన సన్నాహాలు లేని కారణంగా సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్‌ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో టోబీ పెంటీ (ఇంగ్లండ్‌)తో శ్రీకాంత్‌; జేసన్‌ ఆంథోనీ (కెనడా)తో శుభాంకర్‌; అండెర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)తో అజయ్‌ జయరామ్‌; క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌)తో లక్ష్య సేన్‌ ఆడనున్నారు.  

మరిన్ని వార్తలు