సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌.. భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారు

12 May, 2022 14:08 IST|Sakshi

IND VS SA T20 Series: ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే టీ20 సిరీస్‌కు సంబంధించి భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ సిరీస్‌ కోసం జట్టు ఎంపికపై ఇదివరకే కసరత్తు ప్రారంభించిన సెలెక్షన్‌ కమిటీ.. ఈ నెల 26న ప్రాబబుల్స్‌ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ప్లేయర్ల ఎంపికపై చర్చించేందుకు చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ నెల 23న సమావేశం కానుంది. ఈ మీటింగ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా హాజరు కానున్నారు. వీరి అభిప్రాయం తీసుకున్న తరువాత ఆటగాళ్ల జాబితాపై తుది నిర్ణయం తీసుకునే అవ​కాశం ఉంది. స్వదేశంలో జరుగనున్న సిరీస్‌ కావడంతో కేవలం 15 మంది ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక జట్టులో ఎవరెవరికి స్థానం కల్పించబోతున్నారన్న అంశాన్ని పరిశీలిస్తే.. ఐపీఎల్‌కు ముందు శ్రీలంకతో ఆడిన జట్టునే దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఐపీఎల్‌ 2022 స్టార్లు హార్ధిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, తిలక్‌ వర్మ, రాహుల్‌ తెవాతియా, శివమ్‌ దూబే పేర్లను పరిశీలించే ఛాన్స్‌ ఉంది. మరోవైపు విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖరారైందని సమాచారం. ఇటీవల గాయపడిన రవీంద్ర జడేజా, ఫామ్‌లో లేని వెంకటేశ్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌లను తప్పించే అవకాశాలు లేకపోలేదు. కాగా, భారత్‌-సఫారి జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జూన్ 9-20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. 

- తొలి టీ20 : జూన్ 9 (ఢిల్లీ) 

- రెండో టీ20 : జూన్ 12 (కటక్)

- మూడో టీ20 : జూన్ 14 (వైజాగ్) 

- నాలుగో టీ20 : జూన్ 17 (రాజ్‌కోట్) 

- ఐదో టీ20 : జూన్ 19 (బెంగళూరు)  

భారత జట్టు (అంచనా)..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, హార్ధిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌, ఇషాన్‌ కిషన్‌,  చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, సిరాజ్‌, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా
చదవండి: ఎన్ని గోల్డెన్‌ డకౌట్లైనా.. కోహ్లి ఇప్పటికీ గోల్డే..!

మరిన్ని వార్తలు