12 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ‘మట్టి కుస్తీ’ సవాల్‌.. ‘హింద్‌ కేసరి’ విశేషాలు.. పూర్తి వివరాలు

5 Jan, 2023 08:40 IST|Sakshi
2011లో హైదరాబాద్‌లో జరిగిన ‘హింద్‌ కేసరి’ టోర్నీలో టైటిల్‌ నెగ్గిన రోహిత్‌ పటేల్‌ (ఫైల్‌)

రేపటి నుంచి హైదరాబాద్‌లో ‘హింద్‌ కేసరి’ పోటీలు

2011 తర్వాత మరోసారి భాగ్యనగరం ఆతిథ్యం

బరిలో 550 మంది రెజ్లర్లు 

పురుషులు, మహిళల విభాగాల్లో పోరు  

సాక్షి, హైదరాబాద్‌: పుష్కర కాలం తర్వాత భాగ్య  నగరంలో మరోసారి సాంప్రదాయ కుస్తీ పోటీలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం పెద్ద స్థాయి ఈవెంట్లలో అధికారిక క్రీడగా ఉన్న ‘మ్యాట్‌ రెజ్లింగ్‌’ కాకుండా మట్టిలో జరిగే హోరాహోరీ సమరాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అందుకే గత 65 ఏళ్లుగా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లను భాగస్వాములుగా చేస్తూ ఈ టోర్నీలను ‘ఇండియన్‌ స్టయిల్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌’ విజయవంతంగా నిర్వహిస్తోంది.

‘హింద్‌ కేసరి’గా గుర్తింపు తెచ్చుకునేందుకు రెజ్లర్లు తలపడే ఈ ఆసక్తికర మట్టి కుస్తీ టోర్నీకి ఎల్బీ స్టేడియం వేదికవుతోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ప్రముఖ రెజ్లర్లందరూ తలపడతారు. గురువారం సాయంత్రం రెజ్లర్ల వెయింగ్‌ తీసుకుంటారు. సుదీర్ఘ కాలం పాటు తెలంగాణలో రెజ్లింగ్‌ సంఘానికి చిరునామాగా నిలిచిన విజయ్‌కుమార్‌ యాదవ్‌ స్మారకంగా ఈ టోర్నమెంట్‌ను వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్‌లో ‘హింద్‌ కేసరి’ పోటీలు జరగడం ఇది మూడోసారి. 1958లో తొలిసారి జరగ్గా... 2011లో రెండోసారి హైదరాబాద్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2011లో మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిత్‌ పటేల్‌ ఫైనల్లో మౌజమ్‌ ఖత్రీని ఓడించి ‘హింద్‌ కేసరి’ టైటిల్‌ సాధించాడు.  

‘హింద్‌ కేసరి’ ఇతర విశేషాలు... 
►జనవరి 6 నుంచి 8 వరకు ఎల్బీ స్టేడియంలో  ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న రెండు మట్టి కోర్టులలో బౌట్‌లు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి దాదాపు 550 మంది రెజ్లర్లు పాల్గొంటారు.  
►పురుషుల విభాగంలో 55 కేజీల నుంచి 90 కేజీల మధ్య 8 కేటగిరీలలో బౌట్‌లు ఉంటాయి. ‘హింద్‌ కేసరి’ టైటిల్‌ కోసం 85 కేజీల నుంచి 140 కేజీల మధ్య ఉన్న∙రెజ్లర్లు పోటీపడతారు.
►మహిళల విభాగంలో 48 కేజీల నుంచి 68 కేజీల మధ్య 5 కేటగిరీల్లో బౌట్‌లు ఉంటాయి. ‘మహిళా హింద్‌  కేసరి’ టైటిల్‌ కోసం 65 నుంచి 90 కేజీల మధ్య రెజ్లర్లు బరిలోకి దిగుతారు.  

పురుషుల విభాగంలో ‘హింద్‌ కేసరి’ టైటిల్‌ 
విజేతకు రూ. 3 లక్షలతోపాటు 3 కిలోల వెండి గద బహుమతిగా లభిస్తుంది. రన్నరప్‌కు రూ. 2 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన రెజ్లర్‌కు రూ. 1 లక్ష అంద      జేస్తారు. మహిళల ‘హింద్‌ కేసరి’కి రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేస్తారు. ఇతర వెయిట్‌ కేటగిరీ విజేతలకు కూడా నగదు పురస్కారాలు ఇస్తారు.   

చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్‌ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్‌! అక్కడ చెరో విజయం
Rishabh Pant: ఎయిర్‌ అంబులెన్స్‌లో ముంబైకి పంత్‌.. అంబానీ ఆస్పత్రిలో చికిత్స.. ఖర్చు మొత్తం ఎవరిదంటే!

మరిన్ని వార్తలు