ISL: నరాలు తెగే ఉత్కంఠ.. ఎట్టకేలకు తొలి టైటిల్‌ గెలిచిన హైదరాబాద్‌

21 Mar, 2022 07:40 IST|Sakshi

Indian Super League- Hyderabad FC Won Maiden Trophy- ఫటోర్డా (గోవా): ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఎనిమిదో సీజన్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్‌ ‘షూటౌట్‌’లో 3–1తో కేరళ బ్లాస్టర్స్‌ జట్టును ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ మరో గోల్‌ కాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ను నిర్వహించారు.

హైదరాబాద్‌ గోల్‌కీపర్‌ లక్ష్మీకాంత్‌ కట్టిమణి కేరళ బ్లాస్టర్స్‌ ప్లేయర్లు కొట్టిన మూడు షాట్స్‌ను నిలువరించి తమ జట్టును విజేతగా నిలిపాడు. చాంపియన్‌ హైదరాబాద్‌ జట్టుకు రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. అంతకుముందు ఆట 68వ నిమిషంలో కేరళ బ్లాస్టర్స్‌ జట్టుకు రాహుల్‌ గోల్‌ అందించి 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. అయితే 88వ నిమిషంలో సాహిల్‌  గోల్‌తో హైదరాబాద్‌ 1–1తో సమం చేసింది.

కేరళ జట్టు మూడోసారీ రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. 2014, 2016లోనూ కేరళ జట్టు ఫైనల్లో ఓడింది. మరోవైపు హైదరాబాద్‌ జట్టు మూడో ప్రయత్నం లో చాంపియన్‌గా నిలువడం విశేషం. 2019లో హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలువగా.. 2020– 2021 సీజన్‌లో ఐదో స్థానాన్ని పొందింది.  

‘షూటౌట్‌’ సాగిందిలా...
కేరళ బ్లాస్టర్స్‌-    స్కోరు   - హైదరాబాద్‌ 
లెస్కోవిచ్‌ -           01         -జావో విక్టర్‌ 
నిషూ కుమార్‌-        01       - సివెరియో 
ఆయుష్‌-               12       - కమారా 
జీక్సన్‌ సింగ్‌ -        13       -  హాలీచరణ్‌
నోట్‌: ఫలితం తేలిపోవడంతో  ఐదో షాట్‌ను తీసుకోలేదు 

చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు