బలంగా రిజర్వు బెంచ్‌: పరేషాన్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్‌

8 Mar, 2021 19:24 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో త్వరలో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌ కోసం టీమిండియా ఇప్పటినుండే కసరత్తు మొదలుపెట్టింది. టీమిండియా రిజర్వ్‌ బెంచ్‌ కూడా బలంగా ఉండటంతో తుది జట్టులో ఎవరిని ఆడించాలనే అంశంపై జట్టు యాజమాన్యం మల్లగుల్లాలు పడుతుంది. ఓపెనింగ్‌ స్థానం కోసం శిఖర్‌ ధవన్‌, లోకేశ్‌ రాహుల్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉండగా, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు సయ్యంటే సై అంటున్నారు. ఇక జట్టులోకి కొత్తగా వచ్చిన ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాటీయాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. 

వీరిద్దరూ ప్రతిభ కలిగిన ఆటగాళ్లే అయినప్పటికీ, వీరిని ఏ స్థానానికి పరిశీలనలోకి తీసుకోవాలో ఎవరికీ అర్ధం కావట్లేదు. ఇవి చాలవన్నట్లు ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ‍టెస్ట్‌ సిరీస్‌లో అదరగొట్టిన రిషబ్‌ పంత్‌ నా ప్లేస్‌ ఏదీ అంటూ బ్యాట్‌తో ప్రశ్నిస్తున్నాడు. ఆల్‌రౌండర్‌ విభాగంలో హార్ధిక్‌ పాండ్య ప్లేస్‌ సేఫే​అయినప్పటికీ.. అక్షర​ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను కూడా  తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇదిలా ఉంచితే బౌలింగ్‌ విభాగంలో కూడా ఒక్కో స్థానం కోసం ఇద్దరు ముగ్గురు పోటీపడుతుండటంతో ఎవరిని ఆడించాలో, ఎవరిని బెంచ్‌కు పరిమితం చెయ్యాలో అర్ధం కాక యాజమాన్యం తలలు పట్టుకుంటుంది. 

పేసర్లలో దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, నవదీప్‌ సైనీ, శార్ధూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక్క స్పిన్నర్‌ విభాగంలో మాత్రమే చహల్‌కు ఎవరి నుంచి పోటీ లేదని చెప్పాలి. ఓవరాల్‌గా జట్టు కూర్పు విషయం కెప్టెన్‌ కోహ్లికి, కోచ్‌ రవిశాస్త్రికి తలనొప్పిగా మారింది. కాగా, భారత్‌ ఇంగ్లండ్‌ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ మొటేరా వేదికగా ఈనెల 12 నుంచి ప్రారంభంకానుంది.  
చదవండి:
డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌ జరిగేది ఎక్కడో తెలుసా?
వుమెన్స్‌ డే: అనుష్క, కూతురు ఫోటోతో కోహ్లి భావోద్వేగం

మరిన్ని వార్తలు