భారత టెస్టు స్పెషలిస్ట్‌లు దుబాయ్‌కి

6 Oct, 2020 05:26 IST|Sakshi

అక్కడి నుంచే ఆస్ట్రేలియా వెళ్లేలా ఏర్పాట్లు

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టు స్పెషలిస్ట్‌లు, కోచింగ్‌ బృందం కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐపీఎల్‌లో ఆడని చతేశ్వర్‌ పుజారా, హనుమ విహారిలతోపాటు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బందిని నేరుగా ఆస్ట్రేలియా పంపించకుండా సహచరులతో కలిసి దుబాయ్‌ నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వీరందరినీ బోర్డు ఈ నెలాఖరులో దుబాయ్‌కు పంపించనుంది. యూఏఈ నిబంధనల ప్రకారం వీరంతా అక్కడే ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. వారంలో మొదటి, మూడో, ఆరో రోజున కోవిడ్‌–19 పరీక్షలకు హాజరవుతారు. అంతా ఓకే అనుకుంటే బయో బబుల్‌లో అక్కడే ఉన్న భారత జట్టు ఆటగాళ్లతో కలుస్తారు.

వీరంతా ఒకే చార్టెర్డ్‌ ఫ్లయిట్‌లో ఆస్ట్రేలియా బయల్దేరతారు.  ఆస్ట్రేలియా సిరీస్‌ పూర్తిగా బయో బబుల్‌ వాతావరణంలో జరగనున్న నేపథ్యంలో భారత బృందమంతా ఒకే తరహా వాతావరణం నుంచి వెళితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఒక బయో బబుల్‌ రక్షణ కవచం నుంచి మరో బయో బబుల్‌ (ఆస్ట్రేలియాలో)లోకి వెళ్లడం సులువవుతుందని, అందుకే అందరూ కలిసి వెళ్లడం మంచిదని తాము భావించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలో భారత జట్టు నేరుగా ఏ నగరానికి వెళుతుందో, ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతుందో ఇంకా ఖరారు కాలేదు. ఆస్ట్రేలియాలో ఆ సమయంలో ఉండే కరోనా పరిస్థితిని బట్టి మార్పులు జరగవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం రెండు వారాలు క్వారంటీన్‌ కావాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఇప్పటి వర కు ఇంకా ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు