Tokyo Olympics: భారత టీటీ స్టార్‌ ప్లేయర్‌కు షోకాజ్‌ నోటీసు 

5 Aug, 2021 11:29 IST|Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జాతీయ కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) స్టార్‌ క్రీడాకారిణి మనిక బత్రాకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) సిద్ధమైంది. మనిక వ్యక్తిగత కోచ్‌ సన్మయ్‌ పరాంజపేకు ఒలింపిక్స్‌లో పోటీలు జరిగే ప్రదేశంలో ప్రవేశించడానికి అవసరమైన అక్రిడేషన్‌ కార్డు లేకపోవడంతో మనిక ఆడే మ్యాచ్‌లకు అతడు దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో సౌమ్యదీప్‌ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించినా... మనిక పట్టించుకోలేదు. 

ఈ విషయం గురించి టీటీఎఫ్‌ఐ కార్యదర్శి అరుణ్‌ బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘టోక్యోలో జరిగింది దురదృష్టకరం. క్రమశిక్షణా ఉల్లంఘన చర్య. మనికా తన వ్యక్తిగత కోచ్‌ సన్మయ్‌ పరాంజపేతో అక్కడికి వెళ్లారు. కానీ ఆయన అక్రిడేషన్‌ కార్టుతో పోటీలు జరిగే చోట ప్రవేశించలేరు. దీంతో పరాంజపే కార్డు అప్‌గ్రేడ్‌ చేయాలని మనికా డిమాండ్‌ చేసింది. కానీ నిబంధనల ప్రకారం అది కుదరలేదు. సౌమ్యదీప్‌ సలహాలు తీసుకోమని చెప్పగా.. సుతిర్థా ముఖర్జీకి ఆయన ఒకప్పుడు వ్యక్తిగత కోచ్‌గా ఉన్నారంటూ మనికా అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు