క్రికెట్‌ కోచ్‌ పదవిపై ఐదుగురు మహిళల ఆసక్తి

30 Apr, 2021 08:45 IST|Sakshi
నూషిన్‌, హేమలత కలా

భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి కోసం భారీ పోటీ  

ముంబై: భారత మహిళల క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అనేక మంది ఈ పదవి కోసం దరఖాస్తులు దాఖలు చేశారు. ఇందులో ప్రస్తుత కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌తో పాటు గతంలో జట్టుకు కోచ్‌గా పని చేసిన రమేశ్‌ పొవార్, తుషార్‌ అరోథే కూడా ఉన్నారు. రామన్‌ శిక్షణలో భారత జట్టు 2020 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరింది. ఈ ఏడాది మార్చితో ఆయన పదవీకాలం పూర్తి కావడంతో బీసీసీఐ కొత్తగా దరఖాస్తులు కోరింది. రామన్‌కు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఆసక్తికరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు మహిళలు ఈసారి కోచ్‌ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. మాజీ చీఫ్‌ సెలక్టర్‌ హేమలత కలా, మమతా మాబెన్, జయా శర్మ, సుమన్‌ శర్మ, నూషీన్‌ అల్‌ ఖదీర్‌ కోచ్‌ పదవిని ఆశిస్తున్నారు.

భారత మహిళల సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ నీతూ డేవిడ్‌ ఇటీవల జాతీయ జట్టు మహిళల కోచ్‌ ఉంటే బాగుంటుందని అభిప్రాయం వెల్లడించిన నేపథ్యంలో ఇలాంటి స్పందన రావడం ఆసక్తికరం. గతంలో పూర్ణిమా రావు 2017 ఏప్రిల్‌ వరకు టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించారు. మదన్‌లాల్‌ నేతృత్వంలోనే క్రికెట్‌ సలహా కమిటీ కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తుంది. అయితే ఇంటర్వూ్య తేదీలను బోర్డు ఇంకా ప్రకటించలేదు. దరఖాస్తు చేసుకున్నవారిలో హేమలత ఇటీవల యూపీ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించింది. సుమన్‌ కూడా భారత జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పని చేయగా... మాబెన్‌కు బంగ్లాదేశ్, చైనా జట్లకు కోచింగ్‌ ఇచ్చిన అనుభవం ఉంది. మాజీ క్రికెటర్‌ నూషీన్‌ కూడా కోచ్‌గా ఎంతో అనుభవం గడించింది.  చదవండి: రామన్‌కే అవకాశం!

మరిన్ని వార్తలు