ఏడేళ్ల విరామం తర్వాత... తొలి టెస్టు..

14 Apr, 2021 11:41 IST|Sakshi

టెస్టు మ్యాచ్‌ ఆడనున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు

ఈ ఏడాది జూన్‌–జూలైలలో ఇంగ్లండ్‌లో పర్యటన

జూన్‌ 16 నుంచి 19 వరకు

బ్రిస్టల్‌లో ఏకైక టెస్టు

అనంతరం మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు

లండన్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఏడేళ్ల నిరీక్షణ ముగిసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు భారత జట్టుకు టెస్టు మ్యాచ్‌ ఆడే భాగ్యం లభించింది. ఈ ఏడాది జూన్‌–జూలైలలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఏకైక టెస్టు మ్యాచ్‌ సహా మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి 8న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఈ ఏడాది భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడుతుందని ప్రకటించారు. అయితే ఆ రోజు ఆయన వేదిక, తేదీని వెల్లడించలేదు.

కాగా సోమవారం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) భారత మహిళల పర్యటన వివరాలను ప్రకటించింది. జూన్‌ 16 నుంచి 19 వరకు (నాలుగు రోజులు) బ్రిస్టల్‌ మైదానంలో ఇంగ్లండ్, భారత మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు జరుగుతుందని ఈసీబీ తెలిపింది. భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడి ఏడేళ్లయింది. చివరిసారి భారత జట్టు 2014 నవంబర్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు ఆడి ఇన్నింగ్స్‌ 34 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఇంగ్లండ్‌ జట్టుతో భారత్‌ 2014 ఆగస్టులో చివరిసారి టెస్టు ఆడింది.

ఆ మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ నాయకత్వంలోని భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ గడ్డపై భారత మహిళల జట్టు మొత్తం ఎనిమిది టెస్టులు ఆడి ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. రెండు టెస్టుల్లో నెగ్గిన టీమిండియా, మిగతా ఆరు టెస్టులను ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఓవరాల్‌గా భారత జట్టు 1976 నుంచి 2014 వరకు మొత్తం 36 టెస్టులు ఆడి 5 మ్యాచ్‌ల్లో గెలిచి, ఆరింటిలో ఓడి, 25 మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించింది. 

చదవండి: మరోసారి విలియమ్సన్‌కే...
ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా భువీ.. 

మరిన్ని వార్తలు