భారత మహిళా క్రికెటర్లకు ‘ఆ మొత్తం’ అందనేలేదు

24 May, 2021 06:24 IST|Sakshi

14 నెలలు గడిచినా ప్రపంచ టి20 కప్‌ రన్నరప్‌ ప్రైజ్‌మనీ ఇవ్వని బీసీసీఐ

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా గత సంవత్సరం జరిగిన టి20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది.  ఐదు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. అయితే 14 నెలలు పూర్తయినా... రన్నరప్‌ ప్రైజ్‌మనీ ఇప్పటికీ భారత మహిళా క్రికెటర్ల చేతికందనేలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రన్నరప్‌ ప్రైజ్‌మనీ మొత్తం 5 లక్షల డాలర్లను (రూ. 3 కోట్ల 64 లక్షలు) భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గత సంవత్సరం ఏప్రిల్‌లోనే అందజేసినప్పటికీ బోర్డు మాత్రం అమ్మాయిలకు ఆ మొత్తాన్ని ఇప్పటిదాకా ఇవ్వనే లేదు.

మహిళా క్రికెటర్లపై బోర్డు శీతకన్నుకు ఇదో నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఐసీసీ టోర్నమెంట్‌ ముగిసిన ఏడు రోజుల్లోనే ఐసీసీ ప్రైజ్‌మనీ నిధుల్ని ఆయా దేశాల బోర్డులకు పంపిస్తుంది. అయితే సంబంధిత దేశాల బోర్డులే తమ జట్లకు పంపిణీ చేయాలి. నిధులందిన రెండు వారాల్లోపే అమ్మాయిలకు పంపిణీ చేయాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం ఖజానాలోనే అట్టిపెట్టుకుంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టుకు గత సంవత్సరం ఏప్రిల్‌లో... ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టుకు గత ఏడాది మేలోనే ప్రైజ్‌మనీని పంపిణీ చేశాయి.  

వారం రోజుల్లో ఇస్తాం: బీసీసీఐ
బ్రిటన్‌ దినపత్రికలో వచ్చిన ఈ కథనం, దరిమిలా విమర్శలపై బోర్డు స్పందించింది. ఇంతవరకు అమ్మాయిలకు ప్రైజ్‌మనీ మొత్తాన్ని పంపిణీ చేయకపోవడం నిజమేనని అంగీకరించిన బోర్డు వారం రోజుల్లో దానిని మహిళా క్రికెటర్లకు ఇస్తామని తెలిపింది. ‘కరోనా కారణంగా ఈ ఒక్క ప్రైజ్‌మనీయే కాదు... పురుషుల, మహిళల కాంట్రాక్టు ఫీజులు, దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులు, వార్షిక చెల్లింపులు అన్నీ ఆలస్యమే అవుతున్నాయి’ అని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు