రవి దహియా కొత్త చరిత్ర

24 Apr, 2022 05:44 IST|Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా రికార్డు

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): భారత రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా కొత్త చరిత్ర లిఖించాడు. ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగం పోటీల్లో 24 ఏళ్ల రవి దహియా 57 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా వరుసగా మూడో ఏడాదీ విజేతగా నిలిచి ఈ మెగా ఈవెంట్‌లో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసిన తొలి భారతీయ రెజ్లర్‌గానూ ఘనత వహించాడు.

ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో రవి ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలో 12–2తో రఖత్‌ కల్జాన్‌ (కజకిస్తాన్‌)పై గెలుపొందాడు. రవి 2020, 2021 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 57 కేజీల విభాగంలోనే పసిడి పతకాలు సాధించాడు. శనివారం ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓవరాల్‌గా ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) లభించాయి. భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా (65 కేజీలు), గౌరవ్‌ బలియాన్‌ (79 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. 97 కేజీల విభాగంలో సత్యవర్త్‌ కడియాన్, 70 కేజీల విభాగంలో నవీన్‌ కాంస్య పతకాలు గెలిచారు.

మరిన్ని వార్తలు