‘టోక్యో’కు అన్షు, సోనమ్‌

11 Apr, 2021 05:32 IST|Sakshi

అల్మాటీ (కజకిస్తాన్‌): ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో రెండో రోజు భారత్‌కు రెండు బెర్త్‌లు ఖరారయ్యాయి. మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత యువ రెజ్లర్లు అన్షు మలిక్‌ (57 కేజీలు), సోనమ్‌ మలిక్‌ (62 కేజీలు) అద్భుతం చేశారు. హరియాణా రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల అన్షు, 18 ఏళ్ల సోనమ్‌ తమ విభాగాల్లో ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

57 కేజీల ఫైనల్లో అన్షు 4–7తో ఖాన్‌గోరుజుల్‌ బోల్డ్‌సైఖాన్‌ (మంగోలియా) చేతిలో ఓటమి చవిచూసి రజతం సాధించగా... 62 కేజీల ఫైనల్లో జియా లాంగ్‌ (చైనా)తో తలపడాల్సిన సోనమ్‌ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో జియా లాంగ్‌కు స్వర్ణం, సోనమ్‌కు రజతం లభించాయి. అయితే మిగతా మూడు విభాగాల్లో భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. సీమా బిస్లా (50 కేజీలు) నాలుగో స్థానంలో నిలువగా... నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్‌కు చేరిన వారికి మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌లు లభిస్తాయి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు