WFI: ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు రెజ్లర్ల పంచాయతీ

20 Jan, 2023 15:36 IST|Sakshi

ఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళన మూడోరోజు కొనసాగింది. ఈ వ్యవహారంపై గురువారం కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనను మరింత ఉదృతం చేసిన రెజ్లర్లు శుక్రవారం భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ చేశారు.

రెజ్లింగ్‌ సమాఖ్యలో జరుగుతున్న అవకతకవలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు పీటీ ఉషకు రాసిన లేఖలో ప్రధానంగా నాలుగు డిమాండ్లను నివేధించారు. కాగా ఐవోఏ ప్రెసిడెంట్‌ పీటీ ఉష ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ అంశం తనకు బాధ కలిగించిందని.. బాగా డిస్టర్బ్‌ చేసిందన్నారు. రెజ్లర్లు రాసిన లేఖ తనకు అందిందని.. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

ఐవోఏ ముందు రెజ్లర్లు ఉంచిన నాలుగు ప్రధాన డిమాండ్లు
► లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి.
► డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్‌భూషణ్‌ వెంటనే రాజీనామా చేయాలి.
► భారత రెజ్లింగ్‌ సమాఖ్యను రద్దు చేయాలి
► డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలను కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి

రాజీనామా చేసే ప్రస్తకే లేదు: బ్రిజ్‌ భూషణ్‌
అంతకముందు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్య‌క్షుడు.. ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ త‌నపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించిన ఆయన రాజీనామా చేసే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలను బ్రిజ్‌ భూషణ్‌ కొట్టిపారేశారు.ఇవాళ సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ప్రెస్‌మీట్‌లో మాట్లాడ‌నున్న‌ట్లు తెలిపారు. హ‌ర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు త‌మ వ‌ద్ద ఉన్నార‌ని బ్రిజ్ మీడియాకు తెలిపారు.

చదవండి: ‘సాయ్‌’ స్పందన సరిగా లేదు

రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ

మరిన్ని వార్తలు