స్మిత్‌ను పట్టేశారు.. లబూషేన్‌ను వదిలేశారు!

15 Jan, 2021 09:37 IST|Sakshi

బ్రిస్బేన్‌: టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా 87 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. తొలి రోజు ఆటలో భాగంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్‌ వార్నర్‌(1), మార్కస్‌ హారిస్‌(5)లను ఆరంభంలోనే పెవిలియన్‌కు చేర్చి టీమిండియా చక్కటి బ్రేక్‌ సాధించింది. వార్నర్‌ను సిరాజ్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌కు పంపగా, హారిస్‌ను శార్దూల్‌ ఔట్‌ చేశాడు. ఇక లంచ్‌ తర్వాత స్టీవ్‌ స్మిత్‌(36) సైతం పెవిలియన్‌కు చేరాడు.

స్మిత్‌ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో అతన్ని వాషింగ్టన్‌ సుందర్‌ బోల్తా కొట్టించాడు. సుందర్‌ వేసిన 35 ఓవర్‌ తొలి బంతికి స్మిత్‌ ఔటయ్యాడు. సుందర్‌ ప్యాడ్ల పైకి వేసిన ఫుల్‌టాస్‌ డెలివరీని హిట్‌ చేయబోయిన స్మిత్‌.. షార్ట్‌ మిడ్‌ వికెట్‌గా ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇది సుందర్‌కు తొలి టెస్టు వికెట్‌.  ఈ  మ్యాచ్‌ ద్వారా సుందర్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. భారత్‌ తరఫున టెస్టు క్యాప్‌ ధరించిన 301 ఆటగాడు సుందర్‌.  (లెఫ్టార్మ్‌ సీమర్‌ను చూసి ఎంత కాలమైందో తెలుసా?)

లబూషేన్‌ క్యాచ్‌ను వదిలేశారు..
ఇక లబూషేన్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే జారవిడిచాడు. 35వ ఓవర్‌లో స్మిత్‌ను సుందర్‌ ఔట్‌ చేస్తే, ఆ మరుసటి ఓవర్‌లో లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. 36 ఓవర్‌ ఐదో బంతికి లబూషేన్‌ గల్లీలో ఇచ్చిన స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌ క్యాచ్‌ను రహానే వదిలేశాడు. దాంతో లబూషేన్‌కు లైఫ్‌ లభించగా, అసలు ఊహించిన ఈ పరిణామంతో రహానే కాస్త నిరాశ చెందాడు. ఆ బంతి తర్వాత గాయంతో  సైనీ స్టేడియం వదిలి వెళ్లిపోయాడు. ఇక ఆఖరి బంతిని రోహిత్‌ శర్మ వేశాడు. 

మరిన్ని వార్తలు