Rabat Diamond League 2022: అవినాశ్‌ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు

7 Jun, 2022 08:32 IST|Sakshi

రబట్‌ (మొరాకో): వరుసగా కొత్త జాతీయ రికార్డులతో సత్తా చాటుతున్న భారత అథ్లెట్‌ అవినాశ్‌ సబ్లే మరో అరుదైన ఘనతను సాధించాడు. అథ్లెటిక్స్‌ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్‌గా గుర్తింపు ఉన్న డైమండ్‌ లీగ్‌లో అతను ఐదో స్థానంలో నిలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అతను 8 నిమిషాల 12.48 సెకన్లలో గమ్యం చేరాడు. ఇది భారత్‌ తరఫున కొత్త జాతీయ రికార్డు.

గత మార్చిలో తానే నమోదు చేసిన 8 నిమిషాల 16.21 సెకన్ల టైమింగ్‌ను దాదాపు మూడు సెకన్ల తేడాతో అవినాశ్‌ సవరించాడు. ఏకంగా ఎనిమిదిసార్లు అతను తన జాతీయ రికార్డులనే బద్దలు కొడుతూ కొత్త రికార్డులు నెలకొల్పడం విశేషం. గత నెలలో 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసిన అవినాశ్‌... 30 ఏళ్లనాటి బహదూర్‌ ప్రసాద్‌ రికార్డు (13 నిమిషాల 29.70 సెకన్లు)ను తుడిచేశాడు. తాజా ఈవెంట్‌లో టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణపతక విజేత సూఫినాయ్‌ బకాలి (7 నిమిషాల 58.28 సెకన్లు)కి స్వర్ణం దక్కింది.
చదవండి: Rafael Nadal: ‘సెల్యూట్‌ ఫరెవర్‌’.. నాదల్‌పై సచిన్‌, సెహ్వాగ్‌ ప్రశంసలు    

మరిన్ని వార్తలు