NZ Vs IND: న్యూజిలాండ్‌ పర్యటన వాయిదా వేసుకున్న టీమిండియా

16 Sep, 2021 10:56 IST|Sakshi

India Tour Of New Zeland Postponed.. టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనను వాయిదా వేసుకుంది. న్యూజిలాండ్‌ గడ్డపై వచ్చే ఏడాది టీమిండియా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. 2023 వరల్డ్‌కప్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా విరాట్‌ కోహ్లి బృంధం కివీస్‌తో మూడు వన్డేల్లో పాల్గొనాల్సి ఉండగా.. తాజగా వాయిదా పడింది. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2022 ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌ ఆడేలా షెడ్యూల్‌  చేయనున్నట్లు కివీస్‌ క్రికెట్‌ బోర్డు అధికారి తెలిపారు. 

చదవండి: ఈసారి కూడా టైటిల్‌ వాళ్లదే: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

వాస్తవానికి న్యూజిలాండ్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు బిజీగా గడపనుంది. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌ ముగిసిన అనంతరం ఆటగాళ్లు ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌ ఆడేందుకు యూఏఈకి వెళ్లారు. అది ముగిసిన తర్వాత అక్కడే జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2021లో పాల్గొనాల్సి ఉంది. ప్రపంచకప్‌ అనంతరం కివీస్‌ భారత్‌లో పర్యటించి రెండు టెస్టులు, మూడు టీ20 ఆడనుంది. అలా చూసుకుంటే న్యూజిలాండ్‌ డిసెంబర్‌లో మళ్లీ స్వదేశానికి వస్తుంది. కాగా న్యూజిలాండ్‌ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన కరోనా మార్గదర్శకాల ప్రకారం 14 రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంది.

ఇక మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3వరకు జరగనున్న మహిళల వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ గ్యాప్‌లో నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లు న్యూజిలాండ్‌ పర్యటనకు రానున్నాయి. అందుకే వచ్చే ఏడాది ఆగస్టులో జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2022 తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడేలా ప్లాన్‌ చేయనున్నారు. ఇక టీమిండియా, న్యూజిలాండ్‌లు చివరిసారిగా జూన్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన కివీస్‌ తొలి చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.

చదవండి: T20 World Cup 2021: ఆరోజు మమ్మల్ని ఆపటం ఎవరితరం కాదు..

మరిన్ని వార్తలు