INDW Vs ENGW: మంధాన మెరుపులు వృధా.. టీమిండియాకు తప్పని ఓటమి

15 Jul, 2021 16:02 IST|Sakshi

లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20లో ఓపెనర్‌ స్మృతి మంధాన(51 బంతుల్లో 70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిసినా భారత మహిళా జట్టుకు ఓటమి తప్పలేదు. గత మ్యాచ్‌లో స్పూర్తిదాయకమైన పోరాటంతో ఆకట్టుకున్న హర్మన్‌ సేన.. కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసింది. బుధవారం అర్ధరాత్రి వరకు సాగిన ఈ సిరీస్ డిసైడర్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(26 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్‌) బాధ్యాతాయుత ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో రిచా గోష్(13 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ డకౌట్‌గా వెనుదిరగ్గా.. హర్లీన్ డియోల్(0), స్నేహ్ రాణా(4) తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ మూడు, కేథరిన్ బ్రంట్ రెండు, నాట్ సీవర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ జట్టు ఆడుతూ పాడుతూ 18.4 ఓవర్లలో కేవలం 2 కోల్పోయి 154 లక్ష్యాన్ని చేరుకుంది. డేనియల్ వ్యాట్(56 బంతుల్లో 89 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్‌), నాట్ సివర్(36 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. సూపర్ బ్యాటింగ్‌తో రాణించిన డేనియల్ వ్యాట్‌కు ప్లేయర్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ఓటమితో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఏకైక టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత్‌.. వన్డే సిరీస్‌ను 1-2, టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.
 

మరిన్ని వార్తలు