ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు హనుమ విహారి దూరం 

12 Jan, 2021 08:40 IST|Sakshi

సిడ్నీ: తొడ కండరాల గాయంతో భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్, ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి ఆస్ట్రేలియాతో ఈనెల 15 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే చివరిదైన నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. సిడ్నీలో సోమవారం టెస్టు ముగిశాక విహారికి స్కానింగ్‌ చేశారు. దీని రిపోర్టును బట్టి విహారి కేవలం ఒక టెస్టుకా లేదంటే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కూ దూరమయ్యే అవకాశముందో తెలుస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా చేతి వేలు విరిగిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.

అతని స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ తుదిజట్టులోకి వచ్చే అవకాశముంది. చివరి ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ ఓవర్లు ఆడి టెస్టు మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోవడం భారత జట్టుకిది ఏడోసారి. 1979లో ఓవల్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు అత్యధికంగా 150.5 ఓవర్లు ఆడి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. భారత్‌ తరఫున టెస్టుల్లో 6,000 పరుగులు పూర్తి చేసుకున్న 11వ క్రికెటర్‌గా చతేశ్వర్‌ పుజారా ఘనత వహించాడు. పుజారా 80 టెస్టుల్లో ఈ మైలురాయి చేరాడు. చదవండి: విహారి పోరాటం అదిరింది.. ఆసీస్‌ అలసింది

మరిన్ని వార్తలు