సన్‌రైజర్స్‌ ‘గాయం’ ఎంతవరకూ..

25 Sep, 2020 13:41 IST|Sakshi
ఆర్సీబీతో మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ క్లీన్‌బౌల్డ్‌(ఫోటో కర్టసీ: పీటీఐ)

వెబ్‌స్పెషల్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడించింది ఎవరంటే ‘గాయం’ అని అనాలేమో. సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ పోరాడి ఓడిపోయింది. ఇరుజట్ల గెలుపు దోబూచులాటలో చివరకు ఆర్సీబీని పైచేయి సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన టార్గెట్‌ 164. ఇది పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న సన్‌రైజర్స్‌కు చాలా ఈజీ అనే అనుకున్నాం. కానీ చివరకు జరిగింది ఏమిటి. వార్నర్‌ సేన 153 పరుగులకే చాపచుట్టేసింది. గెలుపు దిశగా పయనించి ఒక్కసారిగా కుప్పకూలింది. గెలుస్తామనే ధీమా కడవరకూ కనిపించిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓటమి ‘గాయం’చేస్తే.. మ్యాచ్‌ ఓడిపోవడానికి ఆ జట్టును గాయాలు వేధించడమే కారణం.

ఒకటి మ్యాచ్‌కు ముందు కీలక ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ కండరాల గాయంతో దూరమైతే, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన మిచెల్‌ మార్ష్‌ కూడా గాయపడ్డాడు. చీలమండ గాయంతో అతను నడవలేకుండా ఉండటంతో పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మార్ష్‌ వచ్చే సమయానికి ఇంకా రెండు ఓవర్లు ఉండగా  24 పరుగులు సాధించాలి. మార్ష్‌ ఆల్‌రౌండర్‌ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు ఏమైనా అద్భుతం చేస్తాడేమనని ఆశగా చూశారు. కానీ శివం దూబే వేసిన 19 ఓవర్‌ రెండో బంతికి, అంటే మార్ష్‌ ఆడిన తొలి బంతికే షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు.  ఆ షాట్‌ను కొట్టిన క్రమంలో మార్ష్‌ క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. ఇక ఫిజియో సాయంతో మార్ష్‌ పెవిలియన్‌ చేరాడు.  మార్ష్‌ ఔటైన వెంటనే ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి తప్పదని అర్థమైంది. చివరి వికెట్‌గా సందీప్‌ శర్మ ఔట్‌ కావడంతో 10 పరుగుల దూరంలో సన్‌రైజర్స్‌ నిలిచిపోయి పరాజయం పాలైంది.

విలియమ్సన్‌ ఆడి ఉంటే..
ఈ మ్యాచ్‌లో విలియమ్సన్‌ ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మ్యాచ్‌కు ముందు విలియమ్సన్‌ దూరం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫలితంపై ప్రభావం చూపందనే చెప్పాలి.  సాధారణ స్కోరు లక్ష్య ఛేదనలో ఒక టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ. ఇదే ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి మరో కారణం. ఒకవేళ విలియమ్సన్‌ ఆడి ఉండి ఉంటే ఎస్‌ఆర్‌హెచ్‌ ఆలౌటయ్యే పరిస్థితి వచ్చి ఉండేది కాదని, మ్యాచ్‌ను వార్నర్‌ సేన గెలవడానికి 90 శాతం అవకాశం ఉండేది. ఇక అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ను గాయం వెంటాడింది. బ్యాటింగ్‌ ఆల్‌రౌండరైన మిచెల్‌ మార్ష్‌ క్రీజ్‌లో వచ్చే సమయానికి ఇంకా పది బంతులుపైగా ఉండగా, ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి కావాల్సిన పరుగులు 22గా ఉంది. మార్ష్‌ చీలమండ గాయం కారణంగా పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సాధారణంగా ఏడో స్థానం, అంతకంటే ముందు వరుసలో రావాల్సి ఉ‍న్న మార్ష్‌ చివర్లో రావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో దెబ్బ. ఆ సమయంలో హిట్టింగ్‌ చేయాల్సి రావడంతో వచ్చిన తొలి బంతికే మార్ష్‌ బంతిని గాల్లోకి లేపాడు. బ్యాట్‌ను వేగం జులిపిచ్చాడు కానీ ఆ తర్వాత క్రీజ్‌లో కాలుపెట్టడానికి విలవిల్లాడిపోయాడు. అయితే మార్ష్‌ ఔట్‌ కావడంతో ఫిజియో సాయంతో పెవిలియన్‌కు చేరాడు.(చదవండి: కోహ్లి ఎందుకిలా చేశావు..)

అదే బలం.. అదే బలహీనత
2016లో టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. గత మూడు సీజన్లగా కనీసం ప్లేఆఫ్స్‌కు చేరుతూ వస్తూ అభిమానుల ఆశల్ని వమ్ము చేయడం లేదు. ఈ ఏడాది కూడా ప్లేఆఫ్స్‌కు చేరే జట్ల అంచనాలలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఉంది. వార్నర్‌తో పాటు కేన్‌ విలియమ్సన్‌, మనీష్‌ పాండే, జానీ బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌లు ఆ జట్టుకు ప్రధాన బలంగా కాగా, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ నబీల రూపంలో కూడా మంచి బౌలింగ్‌ వనరులున్నాయి. ఈసారి బిల్లీ స్టాన్‌లేక్‌ కూడా జట్టుతో కలవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉంది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏదైతే బలమని చెప్పుకుంటూ వచ్చామో, ఇప్పుడు అదే బలహీనతగా మారే ప్రమాదం ఉంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రధాన బలమంతా విదేశీ ఆటగాళ్లే. వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, మిచెల్‌ మార్ష్‌(తొలి మ్యాచ్‌లో ఆడి గాయంతో వైదొలిగాడు),  ఫాబియన్‌ అలెన్‌,  మహ్మద్‌ నబీ, జానీ బెయిర్‌ స్టో, బిల్లీ స్టాన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌, జాసన్‌ హోల్డర్‌(మార్ష్‌ స్థానంలో వచ్చిన ఆటగాడు). అంటే ఎస్‌ఆర్‌హెచ్‌లో ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.  వీరంతా కీలక ఆటగాళ్లే. వీరిలో తుది జట్టులో ఆడేది నలుగురు మాత్రమే. విదేశీ ఆటగాళ్లు నలుగురు మించకూడదనేది ఐపీఎల్‌ నిబంధన. 

సన్‌రైజర్స్‌ ‘గాయం’ ఎంతవరకూ
ఎస్‌ఆర్‌హెచ్‌ స్వదేశీ బెంచ్‌ బలంగా ఉందా అంటే అదీ అంతంత మాత్రమే. మనీష్‌ పాండే, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, వృద్ధిమాన్‌ సాహా, విజయ్‌ శంకర్‌లు మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ వారు. వీరిలో మనీష్‌ పాండే బ్యాటింగ్‌లో ప్రధాన పాత్ర పోషించే ఆటగాడైతే, భువీ పేస్‌ బౌలింగ్‌లో కీలక ప్లేయర్‌.  కాగా,  ఎవరికి గాయమైనా రిప్లేస్‌ చేయడానికి సరైన స్వదేశీ బెంచ్‌ లేదు. ఇక్కడ స్వదేశీ ఆటగాడు లేని లోటును విదేశీ ఆటగాడితో పూడ్చినా మొత్తంగా జట్టులో ఉండాల్సిన విదేశీ ఆటగాళ్లు నాలుగుకి మించకుండా చూసుకోవాలి. అంటే స్వదేశీ ఆటగాళ్లు కచ్చితంగా ఏడుగురు ఉండాల్సిందే. 

స్వదేశీ బెంచ్‌ బలంగా లేకపోవడం సన్‌రైజర్స్‌కు అతి పెద్ద మైనస్‌.  ఇక్కడ విదేశీ ఆటగాళ్లు ఉండి కూడా పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి సన్‌రైజర్స్‌ది. ఇక్కడ విదేశీ ఆటగాళ్ల బలంతో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది బలహీనతగా కూడా మారింది. ఇక్కడ స్వదేశీ స్టార్‌లు ఉండి ఉంటే ఎస్‌ఆర్‌హెచ్‌కు పెద్ద సమస్య ఉండేది కాదు. ఒకవైపు విదేశీ ఆటగాళ్ల గాయం ఎస్‌ఆర్‌హెచ్‌ను కలవరపెడుతుంటే, స్వదేశీ రిజర్వ్‌ బెంచ్‌ కూడా బలంగా లేకపోవడం ఆ ఫ్రాంచైజీని ఆందోళనకు గురిచేస్తోంది.ఆర్సీబీతో గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఢీలా పడింది. ఈ లీగ్‌లో ఇక ముందు జరిగే మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు ఎవరూ గాయపడకుండా అంతా సవ్యంగా సాగిపోతే ఆ జట్టుకు ఇబ్బంది ఉండకపోవచ్చు.. ఒకవేళ తొలి మ్యాచ్‌కు ముందు విలియమ్సన్‌ గాయపడినట్లు ఎవరికైనా గాయాలైతే మాత్రం ఆ జట్టు నెట్టుకురావడం కష్టం. 

మరిన్ని వార్తలు