Mary Kom Biography: బాక్సింగ్‌ రింగ్‌ను శాశించిన ఉక్కు మహిళ  

18 Dec, 2022 16:28 IST|Sakshi

అచీవర్స్‌

చుంగ్‌ (ఎత్తుగా), నియ్‌ (సంపద ఉన్న), జాంగ్‌ (దృఢమైన).. ఈ మూడు కలిపితే ‘చుంగ్‌నీజాంగ్‌’.. తన కూతురికి తండ్రి పెట్టిన పేరది!  ఆ సమయంలో ఆ చిన్నారి గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆయన ఏమీ ఆలోచించలేదు. నామకరణంలోనే ఘనకీర్తి రాసిపెట్టి ఉందని ఆయనకు తెలియదు. అప్పటి వరకు మగపిల్లాడు పుడితే బాగుండనుకున్న తల్లి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్న అమ్మాయిని చూసి సంబరంగా గుండెకు హత్తుకుంది.

కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి ‘మరింత వేగంగా, మరింత ఎత్తుకు, మరింత బలంగా’.. అంటూ నినాదం నింపుకున్న విశ్వక్రీడల్లో మెరిసింది.. తన దృఢ సంకల్పంతో విజయాలతో పాటు సంపదనూ మోసుకొచ్చింది. ఆ అమ్మాయే మంగ్తె చుంగ్‌నీజాంగ్‌ మేరీ కోమ్‌.. దేశంలో బాక్సింగ్‌ ఆటకు, మహిళలకు భూమ్యాకాశాలకు ఉన్నంత అంతరం ఉన్న సమయంలో ఆటకు పర్యాయపదంగా నిలిచింది. దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసింది. 

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌... క్రీడాకారులంతా కలలుగనే ఒలింపిక్‌ క్రీడల్లో కాంస్యపతకంతో భారత జెండా రెపరెపలాడించిన క్షణం.. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో కలిపి మరో 12 పతకాలు.. 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ వేదికపై మొదలైన ఈ విజయ ప్రస్థానం 39 ఏళ్ల వయసు వరకూ సాగింది.

ఈ మధ్యలో అమ్మతనం కూడా ఆమె ఆటకు అడ్డుగా మారలేదు. అసాధారణ ప్రదర్శనతో మేరీ కోమ్‌ బాక్సింగ్‌ రింగ్‌ను శాసించింది. ఆమె సాధించిన ఘనతల విలువ రికార్డు పుస్తకాలకే పరిమితం కాదు. వాటి వెనక ఉన్న అపార పట్టుదల, పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. క్రీడల్లో రాణించలేకపోవటానికి సౌకర్యాలు లేకపోవడమే కారణమని సాకులు చెప్పే ఎందరికో మేరీ కోమ్‌ జీవితం ఒక పాఠం, గుణపాఠం నేర్పిస్తుంది. ఆమె నేపథ్యం, ప్రతికూల పరిస్థితులను దాటి వచ్చిన తీరు అనితరసాధ్యం.

బాక్సింగ్‌నే ఇష్టపడి..
డింకో సింగ్‌.. 1998 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన మణిపూర్‌ బాక్సర్‌. అతను ఆ విజయంతో తిరిగి వచ్చిన సమయంలో స్వరాష్ట్రంలో సంబరాలు జరిగాయి. అప్పుడు 16 ఏళ్లు ఉన్న మేరీ వాటన్నింటినీ చూసి ఒక అభిమానిలా గంతులు వేసింది. అంతే తప్ప అప్పటి వరకు కూడా ఆమె బాక్సింగ్‌లో కెరీర్‌ గురించి ఆలోచించనే లేదు. తండ్రి ఒక వ్యవసాయ కూలీ. సహజంగానే ఆర్థిక ఇబ్బందులు. అయితే ఆయన ఎప్పుడూ దానిని సమస్యగా భావించలేదు.

కష్టపడి కుటుంబాన్ని పోషించుకోగలిగితే చాలనుకునే వ్యక్తి. ఇలాంటి నేపథ్యంలో స్కూల్లో పోటీలు తప్ప మేరీకి క్రీడల గురించి మరేమీ తెలీదు. చిన్నప్పటి నుంచి బలంగా ఉన్న ఆమెకు అథ్లెటిక్స్‌లో పోటీపడి గెలవడం చిటికెలో పనిగా మారింది. అయితే ఒక రోజు డింకో సింగ్‌ను చూసిన తర్వాత తనకు సరైన ఆట బాక్సింగ్‌ అనే భావించింది. ఆ పంచ్‌లు, బలంగా ప్రత్యర్థిపై విరుచుకుపడే తత్వం మేరీని ఆకర్షించాయి.

అయితే నాన్నకు తెలిస్తే కోప్పడతాడేమోనని తన ఆసక్తిని రహస్యంగానే ఉంచింది. మేరీ దూకుడు, పోరాటతత్వం బాక్సింగ్‌కు సరిపోతాయని గుర్తించి ఆమెను కోచ్‌లు.. కొసానా మీటీ, నర్జిత్‌ సింగ్‌ ప్రోత్సహించారు. అదే చివరకు మేరీని ప్రపంచ చాంపియన్‌  దిశగా నడిపించింది. సాధనలోనే ఒక రోజు తన కూతురి బాక్సింగ్‌ గురించి తెలుసుకున్న తండ్రి కొంత ఆందోళన చెందినా.. చివరకు సరైన మార్గం ఎంచుకుందని స్థిమితపడ్డాడు. 

పతకాల ప్రవాహం..
2001 అక్టోబర్‌.. పెన్సిల్వేనియాలో మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌.. 48 కేజీల విభాగంలో సత్తా చాటిన మేరీ కోమ్‌ ఫైనల్‌ చేరింది. తుది పోరులో ఓడినా రజతం సాధించి గర్వంగా నిలబడింది. అయితే అది ఆరంభం మాత్రమే. పతకధారణ అంతటితో ఆగిపోలేదు. తొలిసారి సాధించిన రజతం ఆ తర్వాత బంగారమైంది. ఆ వేదికపై మరో ఐదుసార్లు మేరీ మెడలో స్వర్ణం మెరిసింది. 2002, 2005, 2006, 2008, 2010, 2018లలో ఏకంగా ఆరుసార్లు ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ ఇదే తరహాలో ఐదు స్వర్ణాలతో మేరీ తానేంటో చూపించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు, వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ ఒక ఎత్తు కాగా.. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ సాధించిన కాంస్య పతకం మేరీ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. వరుస విజయాలతో సెమీస్‌ చేరిన తర్వాత నికోలా ఆడమ్స్‌ (యూకే) చేతిలో ఓడటంతో మేరీ ఫైనల్‌ ఆశలు నెరవరలేదు. అయితేనేమి ఎక్కడో మణిపురి కోమ్‌ తెగలో పుట్టి లండన్‌ వేదికపై ఒలింపిక్‌ కాంస్య పతకం అందుకుంటున్న క్షణాన ఆమె కళ్ళల్లో కనిపించిన మెరుపు ఆ కంచు పతకం విలువేమిటో చెబుతుంది. బాక్సింగ్‌ పంచ్‌ ద్వారా మెగా ఈవెంట్‌లో భారత జెండా ఎగరేసిన క్షణం అపురూపం.

అడ్డు రాని అమ్మతనం..
బాక్సర్‌గా ఎదుగుతున్న దశలో పరిచయమైన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కరుంగ్‌ ఓన్లర్‌ను మేరీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2005లో పెళ్లి జరిగేనాటికే ఆమె ప్రపంచ చాంపియన్‌  కూడా. పెళ్లి తర్వాత ఆటకు మేరీ విరామమిచ్చింది. చాలామంది ఆమె బాక్సింగ్‌ ముగిసిపోయిందనే భావించారు. ఇతర క్రీడల సంగతేమో కానీ బాక్సింగ్‌లాంటి ఆటలో తల్లిగా మారిన తర్వాత అదే తరహా బలాన్ని ప్రదర్శించడం, శరీరంలో వచ్చే మార్పులతో కలిగే ఇబ్బందులను అధిగమించాల్సి రావడం చాలా కష్టం.

కానీ మేరీ పోరాటతత్వం ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సాధన మొదలు పెట్టింది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఆమె నాలుగు ప్రపంచ చాంపియన్‌ షిప్‌లు, ఒలింపిక్‌ పతకం గెలుచుకోవడం మరో పెద్ద విశేషం. ఈ దంపతులకు ఆ తర్వాత మరో కొడుకు పుట్టగా, ఒక అమ్మాయిని వీరు దత్తత తీసుకున్నారు. 

అవార్డుల పంట..
క్రీడాకారులకు ఇచ్చే అర్జున, ఖేల్‌రత్నలు సహజంగానే మేరీని వెతుక్కుంటూ వచ్చాయి. భారత ప్రభుత్వం ఇచ్చే నాలుగు అత్యుత్తమ పౌర పురస్కారాల్లో భారతరత్న మినహా మిగతా మూడు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు మేరీని వరించాయి. క్రీడల్లో ఆమె చేసిన సేవలకుగాను ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్‌ చేయగా 2016–2022 మధ్య ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తించింది. 

వెండితెర కథగా..
మేరీకోమ్‌ జీవితం ఆధారంగా  2014లో  సినిమా వచ్చింది ఉమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో! ప్రియాంక చోప్రా అందులో మేరీ పాత్రను పోషించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి సహ నిర్మాతగా కూడా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది. ఆమె ఆత్మకథ ‘అన్‌ బ్రేకబుల్‌’ పేరుతో పుస్తకంగా కూడా ప్రచురితమైంది. చిన్నారులకు స్ఫూర్తిని అందించే కథల సంకలనం ‘గుడ్‌నైట్‌ స్టోరీస్‌ ఫర్‌ రెబల్‌ గర్ల్స్‌’లో కూడా మేరీకి చోటు దక్కింది. 

- మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

మరిన్ని వార్తలు